కరోనా నేపథ్యంలో చాలావరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా మూసి ఉంటున్నాయి. ఫలితంగా యాచకులు, రహదారుల పక్కన జీవనం సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది గమనించిన హైదరాబాద్ బేగంబజార్‌లోని ఓ వ్యాపారి పేద ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. 20రోజులకు సరిపడా 10కిలోల బియ్యంతోపాటు.. పప్పు, నూనె, చింతపండు పంపిణీ చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లో హమాలీ కూలీలకు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌లోని పలు కూడళ్లలో ఫూట్‌పాత్‌లపై నివాసముంటున్న అనాథలు, యాచకుల ఆకలి తీర్చడం కోసం ఆల్ ఇండియా మలయాళీ సంఘం వారు పట్టణంలోని క్లాక్‌టవర్, పారడైస్ చౌరాస్తాలో అన్నదానం చేశారు.
నిర్మల్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మాస్క్‌లు తయారు చేయించి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో పంపిణీ చేశారు. బంగల్‌పేట్‌కు చెందిన కౌన్సిలర్ లక్ష్మి కాలనీవాసులకు సబ్బులు, మాస్క్‌లు అందించారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. సాయిదీక్ష సేవాసమితి ఆధ్వర్యంలో రహదారుల పక్కనున్న యాచకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది, వెద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసే వరకు ఈ కార్యక్రమం సాగుతుందని సభ్యులు తెలిపారు. సంగారెడ్డి నారాయణఖేడ్‌లో పోలీసు సిబ్బందికి, కూరగాయలు అమ్ముతున్న వారికి స్థానిక మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో భోజనాలు, మజ్జిగ అందించారు.
పరిమళించిన మానవత్వం.. అన్నార్తులకు చేయూత ఇదీ చూడండి:ప్రజలు ఆకలితో అలమటించొద్దు: కేసీఆర్