తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆలోచన అదుర్స్​.. ఈ ఆసుపత్రిని మడత పెట్టొచ్చు! - micro factories

ఓ రోగి ప్రభుత్వాసుపత్రిలో చేరాలనుకుంటే అక్కడ అతనికో పడకంటూ కేటాయించాలి కదా! కానీ మనదేశంలోని ఆసుపత్రుల్లో ప్రతి వెయ్యిమందికీ 0.5 పడకలే ఉన్నాయన్నది లెక్క. అందుకే ఒకే బెడ్డుపైన ఇద్దరు రోగులు ఉండటమో, అసలు బెడ్డేలేక నేలపైన పడుకోవడమో చూస్తుంటాం మనం. జనాభాకి తగ్గట్టు ఆసుపత్రుల సంఖ్య లేకపోవడం వల్ల ఏర్పడుతున్న ఈ సమస్యకి పరిష్కారంగా ‘మడతపెట్టే ఆసుపత్రులు’ వస్తున్నాయి. వీటిని మనం కోరుకున్నచోటకల్లా తీసుకెళ్లొచ్చు... తక్కువ స్థలంలోనూ ఏర్పాటుచేయొచ్చు!

Folding hospitals idea based startup formed
ఆలోచన అదుర్స్​.. ఈ ఆసుపత్రిని మడత పెట్టొచ్చు!

By

Published : Jan 3, 2021, 8:52 PM IST

ఇదో ఇంజినీరింగ్‌ అద్భుతం! మనం సాధారణంగా ఆఫీసుల్లో పార్టిషన్‌లాంటి వాటికి వాడే మెటీరియల్‌ షీట్స్‌తోనే ఈ ఆసుపత్రుల్ని ఏర్పాటుచేస్తున్నారు. కానీ దాని సైజుని మనం ఐదోవంతుకి మడిచి ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపొందించారు. ఓ పెద్ద లారీలో ఇలా మడతపెట్టిన ఆరు ఆసుపత్రుల యూనిట్‌ని సులభంగా తరలించవచ్చు. అలా తరలించిన యూనిట్‌ని మడత విప్పి... మళ్లీ రెండుగంటల్లో బిగించొచ్చు. మడత పెట్టిన యూనిట్‌లని లారీల్లో ఎక్కించడానికీ దించడానికీ క్రేన్‌లు వాడుతున్నారు. మడతపెట్టడానికి నలుగురూ, దాన్ని విప్పి కొత్తచోట ఏర్పాటు చేయడానికి ఎనిమిది మందీ కావాల్సి ఉంటుంది. ఒక్కో యూనిట్‌ని విప్పి... ఎనిమిదివందల చదరపుటడుగుల వరకూ విస్తరించుకోవచ్చు.

సులభంగా మడతపెట్టే అవకాశం ఉన్నా సరే... ఇందులో విద్యుత్తు, ప్లంబింగ్‌ వసతులకి సంబంధించిన కనెక్షన్‌లన్నీ ఉంటాయి. విద్యుత్తు కనెక్షన్‌ల ద్వారా లైట్లూ, ఏసీ, ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌లే కాకుండా ఆసుపత్రికి కావాల్సిన పరికరాలన్నింటినీ పెట్టుకోవచ్చు. ప్లంబింగ్‌ కనెక్షన్‌ ద్వారా నీటి సరఫరా వసతులతోపాటూ ఆక్సిజన్‌ పైపుల్నీ వాడొచ్చు. ఇందులో వాష్‌రూమ్‌ కూడా ఇన్‌బిల్ట్‌గానే ఉంటుంది. ఇన్ని వసతులున్నా కూడా మడతపెట్టి తీసుకెళ్లేలాగా తయారుచేయడం వల్లే దీన్నో ఇంజినీరింగ్‌ అద్భుతమని అంటున్నారు. ఐఐటీ-మద్రాసులో ఆవిర్భవించిన ‘మాడ్యులస్‌ హౌసింగ్‌’ అనే స్టార్టప్‌ ఈ అద్భుతాన్ని సాధించింది!

ఈ ఆసుపత్రిని మడత పెట్టొచ్చు!

ఇందుకోసమే ఆవిష్కరించినా...

2015లో భారీ వరద కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైన విషయం గుర్తుండే ఉంటుంది! ఆ వరదలప్పుడు అప్పటిదాకా పూరి గుడిసెల్లో ఉంటున్నవాళ్లు వీధులపాలైన దైన్యం ఐఐటీ విద్యార్థులు శ్రీరామ్‌ రవిచంద్రన్‌, గోపినాథ్‌లని కదిలించింది. అలాంటివాళ్లకి అతితక్కువ ధరలో, అప్పటికప్పుడు నిర్మించి ఇచ్చేలా ‘మాడ్యులర్‌ హోమ్స్‌’ తయారు చేయాలనుకున్నారు ఇద్దరూ. అలా చదువుతూనే మడతపెట్టగల ఇళ్ల ఆవిష్కరణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రెండేళ్లలో ఓ నమూనా తయారు చేయగలిగారు. ఆ ఆవిష్కరణ ఆధారంగా ‘మాడ్యులస్‌ హౌసింగ్‌’ అనే స్టార్టప్‌ పెట్టారు. మొదట్లో ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌ అండ్‌ పీ వంటి నిర్మాణ సంస్థల ఉద్యోగుల కోసం వీటితో తాత్కాలిక షెడ్డులు ఏర్పాటుచేసి ఇచ్చారు. నాగాలాండ్‌ రాష్ట్రంలోని కుటీర పరిశ్రమలకి ‘మైక్రో ఫ్యాక్టరీస్‌’ కూడా వీటితో చేసిచ్చారు.

ఇదిలా ఉండగా, 2020 ఏడాది మొదట్లో ‘సెల్కో ఫౌండేషన్‌’ అనే ఎన్జీఓ తాము పనిచేస్తున్న కర్ణాటకతోపాటూ కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో చిన్నసైజు ప్రసూతి కేంద్రాలని ఏర్పాటుచేయాలనుకుని ఈ స్టార్టప్‌ని సంప్రదించింది. వాళ్ల కోసమే తొలిసారి చిన్నసైజు మాడ్యులర్‌ ఆసుపత్రిని ఏర్పాటుచేసే పనిలో పడ్డారు శ్రీరామ్‌, గోపినాథ్‌లు. ఇంతలో కరోనా వచ్చింది. దాంతో ప్రభుత్వ వైద్యశాఖకి ‘ఐసొలేషన్‌ వార్డు’ల అవసరం పెరిగింది. దాంతో ఇదివరకే తాము తయారుచేస్తున్న మాడ్యులర్‌ ప్రసూతి కేంద్రాల డిజైన్‌ కాస్త మార్చి ‘పోర్టబుల్‌ కొవిడ్‌ ఆసుపత్రుల’ని తయారుచేశారు. వాటిని మొదట కేరళ ప్రభుత్వమే ఉపయోగించడం మొదలుపెట్టింది.

అక్కడి వయనాడ్‌ జిల్లాలోని మర్దూర్‌లో 30 పడకలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇందులో కేవలం ఐసొలేషన్‌ గదులే కాకుండా రెండు పడకల ఐసీయూ, వైద్యుల గది, వైద్య సిబ్బంది గది... ఇలా నాలుగు విభాగాలుగా నిర్మించి ఇచ్చారు.

అక్కడితో ఆగలేదు...

ఆసుపత్రుల కోసం తాము నిర్మిస్తున్న యూనిట్‌లకి ‘మెడిక్యాబ్‌’ అని పేరుపెట్టారు. తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ కూడా చెన్నై, చెంగల్పట్టుల్లోనూ ఇలాంటి కొవిడ్‌ ఆసుపత్రుల్ని ఏర్పాటుచేసింది. ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి చెన్నై శివారులో ఏకంగా వంద పడకలతో కూడిన

యూనిట్‌ని నెలకొల్పింది. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగానూ వీటిని ఉపయోగిస్తున్నారు. బిహార్‌, గుజరాత్‌లలో ఇప్పటికే మెడిక్యాబ్‌ ఆసుపత్రులు ఏర్పాటవుతున్నాయి! ‘అంతా బావుందికానీ... మడతపెట్టేయగల ఈ ఆసుపత్రులు అసలు గట్టిగా ఉంటాయా!’ అనుకుంటున్నారా... ఇవి పదేళ్లపాటు చెక్కుచెదరవని చెబుతున్నారు శ్రీరామ్‌. మరి ఖర్చో అంటారా... చదరపుటడుగుకి... రూ.1800 అవుతుంది. అంటే, ఓ మోస్తరు ఆసుపత్రిని ఇంచుమించు 15 లక్షల రూపాయల్లో నిర్మించొచ్చు.

ఇదీ చూడండి: పోషకాల పిండి: తేగలను ఇక తాగెయ్యెచ్చు!

ABOUT THE AUTHOR

...view details