రోజుల తరబడి ముంపులో ఉండడంతో ప్రహరీలూ దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరద ప్రవాహం పునాదులను ఢీకొట్టింది. 5 శాతం ఇళ్లు వేర్వేరు విధాలుగా దెబ్బతిన్నాయి. సమస్య ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉంది. ప్రభావిత భవనాలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. సంబంధిత యజమానులు, వెంటనే చర్యలు ప్రారంభించాల్సిన అవసరముందని గుర్తుచేసింది.
నోటీసుల ఇచ్చిన కొన్ని నిర్మాణాలు
- చైతన్యపురి పుల్లారెడ్డి మిఠాయి దుకాణం వెనుకనున్న రెండంతస్తుల నిర్మాణం పునాది వరద ప్రవాహానికి పూర్తిగా దెబ్బతింది. కూల్చివేయాలని నోటీసు ఇవ్వగా, యజమాని అంగీకరించారని బల్దియా తెలిపింది. సమీపంలోని స్వయంవర్ షోరూం పక్కన, వెనుకనున్న రెండు జి+3 భవనాలూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. జాగ్రత్త చర్యలతో వాటి ప్రహరీని తిరిగి నిర్మించాలంటూ, భవనం గోడలకూ మరమ్మతులు చేసుకోవాలని సూచించారు.
- కోదండరామ్‌నగర్‌లోని ఎం.జగన్‌మోహన్‌శర్మ ఇంటి ప్రహరీ వరద ప్రవాహంతో దెబ్బతినగా, పునర్నిర్మించుకోవాలని బల్దియా సూచించింది. ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
- తిరుమల్‌నగర్‌లో గతంలో శారద థియేటర్ వెనుకనున్న భవనం రోడ్డు కంటే దిగువన ఉంది. ఎక్కువ రోజులు ముంపులో ఉండటంతో ప్రహరీని పునర్నిర్మించుకోవాలని, నిర్మాణానికి మరమ్మతులు చేసుకోవాలని ఇంజినీర్లు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పలు ఇతర భవనాల ప్రహరీలను కూల్చి కొత్తగా కట్టుకోవాలని సూచించారు.
- చైతన్యపురి ప్రధాన రోడ్డులోని అన్నపూర్ణ షాపింగ్ మాల్ భవనం చాలా రోజులపాటు నీటిలో ఉన్నందున నిర్మాణానికి మరమ్మతులు అవసరమయ్యాయి.