భారీ వర్షాల కారణంగా పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో (Kovvur road damaged) 16 నంబరు జాతీయ రహదారి కోతకు గురైంది. నెల్లూరు నగరం దాటాక చెన్నై-కోల్‌కతా మార్గంలో రోడ్డు ధ్వంసమైంది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.
తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
కోవూరు వద్ద భగత్‌సింగ్ కాలనీ వద్ద జాతీయ రహదారికి (kovvur highway damaged) మరమ్మతులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్నామని.. అధికారులు తెలిాపారు. ఒక మార్గంలో వాహన రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. రహదారికి రెండో వైపు కల్వర్టు తెగిపోయిందని.. కల్వర్టు నిర్మించాక రెండో వైపు వాహనాలకు అనుమతి ఇస్తామని తెలిపారు. నెల్లూరు-విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కడప-తిరుపతి మార్గంలో రాకపోకలు ఆర్టీసీ నిలిపేసింది. చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నిలిపేశారు.