nagarjunasagar dam : సాగర్‌కు రోజుకు 5 టీఎంసీలు.. - nagarjunasagar dam latest news
nagarjunasagar dam : నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. జలాశయంలో రోజుకు అయిదు టీఎంసీల నీటి నిల్వ పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి.. సాగర్‌కు 65,556 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ఔట్ ఫ్లో 25,763 క్యూసెక్కులుగా ఉంది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
NAGARJUNA SAGAR
By
Published : Jul 25, 2022, 9:50 AM IST
nagarjunasagar dam : నాగార్జునసాగర్ జలాశయంలో రోజుకు అయిదు టీఎంసీల నీటి నిల్వ పెరుగుతోంది. ఈ నీటి సంవత్సరం (జూన్ 1నుంచి) ఆదివారం వరకు 41.91 టీఎంసీలు వచ్చాయి. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 544.50 అడుగుల వరకు నీరు చేరింది. మరోవైపు శ్రీశైలం నుంచి కొంతవరకు నీటి విడుదల తగ్గింది. తుంగభద్ర, ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుంచి కూడా ప్రవాహం తగ్గడమే దీనికి కారణం.
నాగార్జునసాగర్ ఇన్‌ఫ్లో 65,556 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 25,763 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 199.97 టీఎంసీలుగా ఉంది. గోదావరి పరీవాహకంలో ఎల్లంపల్లి నుంచి 2.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు విడుదలవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని లక్ష్మీ బ్యారేజీ (మేడిగడ్డ) నుంచి 6.89 లక్షల క్యూసెక్కుల జలాలను వదులుతున్నారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నుంచి విడుదల కొనసాగుతోంది.
నిర్విరామంగా విద్యుదుత్పత్తి..శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రంలో 5 యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి 23 వరకు 13.100 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు జెన్‌కో అధికార యంత్రాంగం తెలిపింది. పులిచింతల జెన్‌కో విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేసిన నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. దీంతో ఇక్కడ 50 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు ఎస్‌ఈ దేశ్యానాయక్ తెలిపారు.
నేడు, రేపు భారీ వర్షాలు..రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌పై 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ భారతంవైపు వంపు తిరిగి ఉంది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా లోకరి(ఆదిలాబాద్ జిల్లా)లో 5.6 సెం.మీ, నీల్వాయి(మంచిర్యాల) 5.3, ముథోల్(నిర్మల్) 4, ఈసల తక్కళ్లపల్లి(పెద్దపల్లి)లో 3.8 సెం.మీ. వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా ప్రాంతాల వారీగా 3 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా నమోదైంది.
నాట్లు వేసిన నేల.. రాళ్లు రప్పలతో ఇలా..రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర, దంతాలపల్లి మండలాల రైతులు భారీగా పంట నష్టపోయారు. పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన కమ్మగాని మల్లయ్య రెండెకరాల్లో వరి పంట వేశారు. లోలెవల్ కల్వర్టు తెగిపోవడంతో వర్షపునీరు ఎక్కువగా ప్రవహించి పొలంలో మొత్తం రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. వరినాట్లు వేయడానికి ఖర్చు రూ.22 వేలు అయ్యాయని, పంట పూర్తిగా పాడైందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.