శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 33 అడుగులు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 6,53,302 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులకు చేరుకోగా.. నీటినిల్వ 202.96 టీఎంసీలగా ఉంది. శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గుతున్న ప్రవాహం
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహాలు క్రమంగా తగ్గుతున్నాయి. గత అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం నాలుగు గంటల వరకు దాదాపు 8 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగింది. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి 6.82 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతుంది. ఈ మధ్యాహ్ననికి క్రమంగా 4.4 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఎగువన పులిచింతల నుంచి ప్రస్తుతం 4.45 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల అవుతుండగా.. ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతం 57.05 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న వరద ప్రవాహాలు కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి 180 టీఎంసీల వరకు సముద్రంలోకి విడుదలైనట్లు జలవనరుల శాఖా అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి 900 టీఎంసీల మేర నీరు సముద్రంలో కలిసి ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి:కృష్ణమ్మ ఉగ్రరూపం.. నిండా మునిగిన లంక గ్రామాలు