తెలంగాణ

telangana

ETV Bharat / city

ముప్పు తొలగినా.. తిప్పలు తప్పడం లేదు..! - Hyderabad floods

వరదలొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా భాగ్యనగర శివారు జల్‌పల్లిలోని పరిస్థితులు కుదుటపడలేదు. నేటికీ 150 వరకు ఇళ్లు ముంపులోనే ఉండిపోయాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వరద ముంపు తగ్గినా, ఇక్కడ మాత్రం తగ్గలేదు.

flood effect on Hyderabad people
హైదరాబాద్​లో ముంపు బాధితుల సమస్యలు

By

Published : Dec 10, 2020, 9:33 AM IST

మా ఇల్లు పైకప్పు వరకు మునిగింది. సామగ్రి నానిపోయి పాడైంది. ద్విచక్ర వాహనం తుప్పు పట్టింది. రెండు నెలలుగా మా గోడు పట్టించుకునే నాథుడే లేడు. ఇంట్లోంచి వరద నీరు తగ్గినా, వీధుల్లో నడుములోతు నీరు ఉంది. రెండు నెలలుగా అద్దెంట్లోనే ఉంటున్నాం. మరమ్మతులకు కనీసం రూ.20 వేలు అవసరమయ్యేలా ఉంది.

- జల్‌పల్లి పరిధి ఉస్మాన్‌నగర్‌లోని అబ్దుల్లానగర్‌కు చెందిన షెహజాది ఆవేదన.

వరదలొచ్చి దాదాపు రెండు నెలలవుతున్నా భాగ్యనగర శివారు జల్‌పల్లిలోని పరిస్థితులు కుదుటపడలేదు. నేటికీ 150 వరకు ఇళ్లు ముంపులోనే ఉండిపోయాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వరద ముంపు తగ్గినా, ఇక్కడ మాత్రం తగ్గలేదు. ‘ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయిలో పర్యటించగా నేటికీ ఉస్మాన్‌ నగర్‌లోని వీధుల్లో వరద నీరు పారుతోంది. పైకప్పుల వరకు మునిగిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. అక్టోబరు 13 రాత్రి కురిసిన భారీ వర్షాలతో జల్‌పల్లి శివారులోని బురాన్‌ఖాన్‌ చెరువు(వెంకటాపూర్‌ చెరువు) పొంగింది. బ్యాక్‌ వాటర్‌తో ఉస్మాన్‌నగర్‌ పరిధిలోని సుమారు 700 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. చెరువు నీటిని ఇంజిన్లతో తోడుతున్నా, పూర్తిస్థాయిలో ముంపు తొలగలేదు. తొలుత హడావుడి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నానిన ఇళ్లు ఎప్పుడు కూలుతాయోనని బాధితులు భయపడుతున్నారు. రూ.లక్షల విలువైన గృహోపకరణాలు ఏ మాత్రం ఉపయోగపడవని చెబుతున్నారు.

వరద తగ్గిన చోట వ్యాధుల భయం

వరద తగ్గిన వీధుల్లో మున్సిపల్‌ అధికారుల నిర్లిప్తతతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. పాకుడు పట్టి పచ్చగా మారింది. నీరు తగ్గిన చోట్ల ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఇళ్లకు తాళాలు వేసి మరో చోట ఉంటున్నారు. వరద నీటి నిల్వతో దోమలు బాగా పెరిగి రాత్రిళ్లు కంటి మీద కునుకు ఉండటం లేదని వాపోతున్నారు. జ్వర బాధితులూ పెరిగారని చెబుతున్నారు.

సొంతిళ్లు వదులుకొని అద్దె ఇళ్లలో జీవనం

రెండు నెలలుగా వరద బాధితులు సొంతిళ్లను వదులుకొని అద్దె ఇళ్లలో జీవిస్తున్నారు. సొంతిళ్లలో ఉండే పరిస్థితి లేక సమీపంలోని ఇళ్లలో నెలకు రూ.3 వేల వరకు వెచ్చించి అద్దెకు ఉంటున్నారు. అసలే కొవిడ్‌ కారణంగా ఉపాధి సరిగా లేక ఇబ్బంది పడుతున్న దశలో అద్దెలు భారమయ్యాయని వాపోతున్నారు.

కిరాయి ఇంట్లో ఉంటున్నాం :

పైసా పైసా కూడబెట్టుకుని ఇంటిని కొంతకొంత కట్టుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నాం. భారీ వర్షాలతో ఆ ఇల్లు నీటమునగడంతో రెండు నెలలుగా ఇంట్లో అడుగుపెట్టలేని పరిస్థితి. కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో సామగ్రి పూర్తిగా పాడైపోయింది. అద్దె భారమైంది.

రషీదాబేగం, ఉస్మాన్‌నగర్‌

రూ.10 వేల సాయం అందలేదు :

పది రోజుల కిందట మా ఇంట్లో నీరు తగ్గింది కానీ చుట్టూ ఉన్న నీరు పోలేదు. ఇంట్లోకి వెళ్లలేకపోతున్నాం. టీవీ, ఫ్రిజ్‌, ఇతర సామగ్రి పాడయ్యాయి. ప్రభుత్వం నుంచి రూ.పదివేలు సాయం అందలేదు. అధికారులు సర్వే చేస్తామన్నా.. నేటికీ చేయలేదు.

- మహమ్మద్‌ నయీం

ABOUT THE AUTHOR

...view details