హైదరాబాద్‌లో వరద బాధితులు ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని మీసేవా కేంద్రాల ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి, అడ్డగుట్ట, అల్వాల్, జవహర్‌నగర్‌లోని మీసేవా కేంద్రాల ముందు పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. నిన్న ఉదయం 8 గంటలకే క్యూలో ఉన్న బాధితులకు సాయంత్రం నాలుగు గంటల సమయంలో దరఖాస్తు చేసుకునే వీలు దొరకిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని... నేడు తెల్లవారుజాము నుంచే నిరీక్షిస్తున్నారు.
మీసేవల ముందు పడిగాపులు... క్యూలైన్లలో పడరాని పాట్లు - flood affected people waiting in front of meeseava centers
మీసేవల ముందు వరద బాధితుల పడిగాపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వరద బాధితులు క్యూలైన్లలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తెల్లవారు జామునుంచే మీసేవల ముందు బాధితులు బారులు తీరారు.
లాల్‌బజార్, ఓల్డ్ అల్వాల్ బొల్లారం, జవహర్‌నగర్ బాలాజీనగర్ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు. కేంద్రానికి వచ్చిన వృద్ధులను క్యూ లేకుండానే అల్వాల్ పోలీసులు నేరుగా లోపలికి పంపించారు. మీ సేవా సెంటర్‌లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.
పాతబస్తీ ఉప్పుగూడ, ఫలక్‌నూమ, లాల్‌దర్వాజ, ఛత్రినాక, జహ్నుమ తదితర ప్రాంతాల్లో మీసేవ కేంద్రాల వద్ద వరద బాధితులు ఉదయం నుంచే లైన్లలో వేచి ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో పదిన్నర వరకు కూడా మీసేవా కేంద్రాలు తెరుచుకోలేదు. కొన్ని చోట్ల సర్వర్ డౌన్ అయ్యాయని చెబుతున్నారు. వరద ప్రభుత్వ ఆర్థిక సాయం దరఖాస్తు చేసుకునేందుకు ఇళ్లలో వంటలు చేయకుండా లైన్లలో నిరీక్షిస్తున్నామని మహిళలు చెబుతున్నారు.