భారత వాయుసేనకు చెందిన ఓ లెఫ్టినెంట్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని శిక్షణలో ఉన్న ఓ అధికారిణి ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఆ అధికారిని ఆదివారం అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్ వాయుసేన శిక్షణ కళాశాలలో ఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీస్ అధికారి దీపక్ దమన్ అరెస్టును ధ్రువీకరించారు.
సదరు మహిళా అధికారిణి(28) కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్ ఎయిర్‌ఫోర్స్ ట్రెయిన్ కాలేజీలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 10న క్రీడా శిక్షణ సమయంలో ఆమె గాయపడ్డారు. చికిత్స అనంతరం తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ అమరేందర్(29) ఆమె గదిలోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 15 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు తొలుత వాయుసేన అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోనందునే పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
కోయంబత్తూరు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా గాంధీపురం మహిళా పోలీస్ స్టేషన్‌కు కేసును అప్పగించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడు అమితేశ్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. మెజిస్ట్రేట్ రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం నిందితుడిని ఉడుమల్పేట్ జైలుకు తరలించామని అధికారులు తెలిపారు. సెక్షన్ 376 కింద అతనిపై కేసు నమోదుచేశామని కోయంబత్తూరు పోలీస్ అధికారి దీపక్ తెలిపారు.