Dharani Portal : 2017 సెప్టెంబరు అనంతరం రాష్ట్రంలో చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో అనేక తప్పులు దొర్లాయి. వాటిని సరిచేయకుండానే ధరణిలోకి ఎక్కించడం, కొన్నింటిని వదిలివేయడం రైతులకు శాపంగా మారింది. వీఆర్వోల వల్ల సమస్య ఉత్పన్నమైందని ఆ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం వీటి పరిష్కారంలో మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో 72 లక్షల భూ ఖాతాలుండగా 61.30 లక్షల వ్యవసాయ ఖాతాల సమాచారం స్పష్టంగా ఉందని రెవెన్యూశాఖ గుర్తించింది. ఇవికాక మరో మూడున్నర లక్షల ఖాతాలు ధరణిలోకి ఎక్కాల్సి ఉంది. ధరణిలో నిక్షిప్తమైన పాసుపుస్తకాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా తప్పులున్నాయి. వాటిని కూడా సరిచేయడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఇలాంటి సమస్యలెన్నో...ములుగు జిల్లా ఇంచెర్లకు చెందిన ప్రభాకర్‌కు మూడున్నర ఎకరాల భూమి ఉండగా ఎకరంన్నర విస్తీర్ణం కొత్తపాసుపుస్తకంలోకి ఎక్కలేదు.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం లింగోజీగూడ తండాకు చెందిన రత్నమ్మకు 31 సర్వే నంబరులో ఉన్న 0.25 ఎకరాలకు బదులు 0.07 ఎకరాలుగా నమోదు చేసి కొత్త పాసుపుస్తకం ఇచ్చారు. పొలం సాగు చేసుకుంటున్నా హక్కులు లేక ఇబ్బంది పడుతున్నారు.