వర్షాభావ పరిస్థితులు.. ఏటా పలకరించే కరవు.. ఎంత కష్టపడినా.. సాగు చేసిన పంట చేతికి వస్తుందో లేదోనన్న భయం. వీటన్నిటి మధ్య నష్టాల్లో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రైతులు.. సరికొత్త వ్యవసాయం వైపు దృష్టి సారించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడంతో పాటు.. ఏడాది పొడవునా ఆదాయం సమకూరే ఐదంతస్తుల వ్యవసాయం వైపు(five steps farming) మొగ్గుచూపుతున్నారు.
భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా
అతి తక్కువ విస్తీర్ణంలో 30 రకాల పంటలు(Five Steps Farming) సాగుచేస్తున్నారు. రైతు ఆసక్తికి అనుగుణంగా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను అనుసరించి, పలు రకాలు పంటలు సాగుచేస్తున్నారు. మొదటి అంతస్తుగా మామిడి, దానిమ్మ, అల్లనేరేడు, బత్తాయి వంటి పండ్ల రకాలు.. రెండో అంతస్తులో బొప్పాయి, నిమ్మ, జామ రకాలు.. మూడో అంతస్తులో టమోటా, బెండ, వంగ, మిరప వంటి కూరగాయలు.. నాలుగో అంతస్తులో పాలకూర, కొత్తిమీర, గోంగూర, చుక్కకూర వంటి ఆకు కూరల రకాలు.. ఐదో అంతస్తులో ముల్లంగి, ఉల్లి, క్యారెట్, బీట్‌రూట్ వంటి దుంపకూరలు సాగు చేస్తున్నారు. ఈ విధానం మంచి లాభాలు తెచ్చిపెడుతుందంటున్నారు చిత్తూరు జిల్లా రైతులు.
36 అడుగులకు కొన్ని చెట్లు, 18 అడుగులకు కొన్ని చెట్లు, 9 అడుగులకు మరికొన్ని చెట్లు సాగు చేశాం. ఎక్కువ నీడ, తక్కువ నీడకు పండే పంటలను చూసుకుంటూ వేస్తున్నాం. దీని ద్వారా మంచి లాభాలు గడిస్తున్నాం. -లక్ష్మీ, అంకిశెట్టి పల్లి