హైదరాబాద్ జిల్లాకు ఐదేళ్ల వ్యవధిలో ఐదుగురు కలెక్టర్లు మారారు. దీంతో సర్కారు స్థలాల పరిరక్షణ నేతిబీరచందంగా మారింది. సంక్షేమ పథకాల అమలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. బదిలీపై వచ్చిన అధికారులకు అవగాహన వచ్చేలోపు స్థానచలనం కావటంతో కీలకమైన దస్త్రాలు కూడా ఏళ్లుగా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. ప్రజాసేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో విధుల్లో చేరిన ఐఏఎస్‌లు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. నగరంలో బాధ్యతలు కేవలం ప్రొటోకాల్ కలెక్టర్‌గా ముద్ర వేస్తున్నాయంటూ గతంలో పనిచేసిన ఓ ఐఏయస్ అధికారి ఆవేదన వెలిబుచ్చారు.
రాజధాని పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలున్నాయి. కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్న ఐఏఎస్‌ల్లో అధికశాతం పదోన్నతి ముందు వస్తున్నారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో చేరుతున్నారు. న్యాయస్థానాల్లోని కీలకమైన కేసులు, దస్త్రాలు, ప్రజల దరఖాస్తులు ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పరిధిలో 16 రెవెన్యూ మండలాలున్నాయి. షాదీముబారక్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కుల, ఆస్తి, నిరభ్యంతర తదితర ధృవీకరణపత్రాలు, సేవలు తహసీల్దార్ కార్యాలయాల్లో అందుతుంటాయి. పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడటంతో కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ పెత్తనం సాగుతోంది. యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నా చూసీచూడనట్టుగా ఉండాల్సి వస్తోందంటూ ఓ తహసీల్దార్ ఆవేదన వెలిబుచ్చారు.