హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వరద నీటితో కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి. లోతట్టు వీధులు చెరువుల్లా మారాయి. హయత్‌నగర్ డిపో ప్రాంతం రాత్రి నుంచి జలదిగ్బంధం అయ్యింది. వర్షపు నీటి ప్రవాహంతో జనాలు నిత్యావసాలకు కూడా అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
చేప పిల్లల వెంట పిల్లల పరుగులు...
ప్రస్తుతం వర్షం ఆగిపోవటం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. అయితే అన్ని ప్రాంతాల్లో జనాలు వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. హయత్నగర్లో స్థానికులు మాత్రం చేపల వేట సాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న నీళ్లలో చేపలు కొట్టుకువస్తున్నాయి. శాంతినగర్ కాలనీలోని కోర్టు, డిపోల ముందున్న రోడ్డుపై ప్రవాహ ఉద్ధృతి తగ్గిపోవటం వల్ల స్థానికులు... బయటకు వచ్చి గమనించగా... చేపలు కనిపించాయి. వెంటనే పిల్లలు పెద్దలు ఇక చేపల వెంట పడ్డారు. నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన చేప పిల్లలను పట్టేందుకు... పరుగులు పెట్టారు. చిన్నారులైతే సంతోషంతో కేరింతలు కొడుతూ... చేపల వేట సాగించారు.