టీకా వేయించుకుని.. స్ఫూర్తిని నింపి..
హైదరాబాద్‌లోని దమ్మాయిగూడకు చెందిన కిష్టమ్మ గాంధీ ఆసుపత్రిలో 14 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా సేవలు అందిస్తోంది. ఆమె తన అనుభవంలో ఎంతోమంది రోగుల కష్టాలని, కన్నీళ్లని చూసి ఉంటుంది. కానీ ఇన్నాళ్లకు ఆ కన్నీళ్లను తుడిచి ఓదార్చేందుకు ఆమెకో అవకాశం వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకుని... తోటి వారిలో స్ఫూర్తిని నింపే అవకాశాన్ని ఆమె వదులుకోదలుచుకోలేదు. అందుకోసం ఇంట్లోవాళ్లు వద్దని వారించినా ఆమె ధైర్యంగా ముందడుగు వేయడం విశేషం. గతంలో గాంధీ ఆసుపత్రిని కొవిడ్ నోడల్ సెంటర్‌గా మార్చినప్పుడు వైద్యుల నుంచి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఆందోళన ఉన్నా... దాన్ని పక్కనపెట్టి చాలా ధైర్యంగా పనిచేశారు. అలాంటి వారిలో కిష్టమ్మ కూడా ఒకరు. కేసులు పెరుగుతున్న సమయంలో ‘ఇక కష్టపడింది చాలు. ఇంట్లోనే ఉండమ్మా అంటూ కొడుకులు, నీ గురించి కూడా కాస్త ఆలోచించుకో’ అంటూ భర్త ఇలా ఎవరెన్ని చెప్పినా ఆమె వెనక్కి తగ్గలేదు. శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్‌లో కిష్టమ్మ క్రియాశీలకంగా ఉండటం...కార్మికుల సమస్యలపై ధైర్యంగా అధికారులతో మాట్లాడటం వంటి కారణాల వల్ల ఆమెకు తోటి కార్మికుల్లో ఓ ప్రత్యేకత ఉంది. అందువల్లే పారిశుద్ధ్య కార్మికుల్లో ఒకరికి టీకా అందించాలని భావించినప్పుడు అధికారులతోపాటు కార్మికుల్లో చాలామందికి తొలుత కిష్టమ్మ పేరే గుర్తుకొచ్చింది. ‘‘మా అబ్బాయి పోలీసుశాఖలో పనిచేస్తున్నాడు. అందరికీ ధైర్యం చెప్పే కుటుంబం మాది. అందుకే నా పేరు మా సూపరింటెండెంట్ సారు చెప్పినప్పుడు కొద్దిగా భయపడ్డా.. తర్వాత నాకు నేను సర్దిచెప్పుకున్నా. మనం కాకపోతే ఎవరు ముందుకొస్తారని అనిపించింది. ఇదే విషయం ఇంట్లో చెబితే.. వద్దని వారించారు. అయినా వైద్యులు ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకొచ్చా.’ అనే కిష్టమ్మని ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు.