తెలంగాణ

telangana

nethannaku cheyutha scheme : నేతన్న చేయూతకు తొలి విడతగా రూ.30 కోట్లు

By

Published : Aug 4, 2021, 8:05 AM IST

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న చేనేత కార్మికులకు చేయూతనందించేందుకు రాష్ట్ర సర్కార్ నేతన్నకు చేయూత పథకానికి రూ.368 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నేతన్నకు చేయూత పథకానికి విస్తృతి
నేతన్నకు చేయూత పథకానికి విస్తృతి

తెలంగాణలో నేతన్నకు చేయూత పథకానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతి కల్పించింది. మొత్తం రూ.368 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా రూ.30 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది పొదుపు, ఆర్థిక భద్రతతో కూడిన పథకం. మూడేళ్ల కాల పరిమితితో దీనిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

51వేల మంది కార్మికులకు పథకం..

చేనేత కార్మికులు తమ వేతనాల నుంచి నెలనెలా 8 శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం దానికి రెట్టింపు.. అంటే 16 శాతం జమ చేస్తుంది. ఇప్పటిదాకా 25 వేల మందికి వర్తిస్తుండగా ఈ కేటగిరీలో తాజాగా రంగుల అద్దకం కార్మికులు, డిజైనర్లు, వీవర్లు, వైండర్లు తదితరులను కూడా చేర్చింది. వారంతా 10 వేల మంది వరకూ ఉంటారు. మరో 16 వేల మంది మరమగ్గాల కార్మికులు కూడా లబ్ధిపొందనున్నారు. వీరు మాత్రం 8 శాతం పొదుపు చేయాలి. ప్రభుత్వం నుంచి అంతే జమవుతుంది. ఇలా.. దాదాపు 51 వేల మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది.

2017లో ప్రారంభం..

2017 జూన్‌ 24న తొలుత మూడేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం తమకు ఎంతో మేలు చేసిందని, పునఃప్రారంభించాలని చేనేత కార్మికులు కోరిన మేరకు మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రతిపాదించారు. సీఎం ఆమోదం తెలపడంతో జూన్‌ 14న దీనిని మళ్లీ ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు.

అర్హుల సంఖ్య పెరుగుతున్నందున..

మొదట ఈ పథకానికి రూ.338 కోట్లు అవసరమని చేనేత, జౌళి శాఖ అంచనా వేసింది. అర్హుల సంఖ్య పెరుగుతున్నందున అదనంగా రూ.30 కోట్లను కలిపి మొత్తంగా రూ.368 కోట్లను మంజూరు చేసింది. గతంలో మూడేళ్ల వ్యవధిలో రూ.103 కోట్లను ఈ పథకానికి వెచ్చించింది.

ABOUT THE AUTHOR

...view details