ఏపీలో తొలివిడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెర ఏపీలో పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు నేటితో ప్రచారానికి తెరపడుతున్న వేళ.. అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓటుకు సరాసరిన 2 వేల రూపాయలు పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లకు గృహోపకరణాల్ని పంపిణీ చేస్తున్నారు. ఇంట్లోని ఓట్ల సంఖ్యను బట్టి... కుక్కర్, మిక్సీ, ఫ్యాన్ వంటి బహుమతులు ఆశ చూపి ఓట్లు రాబట్టుకొనే యత్నాల్లో ఉన్నారు. కడప జిల్లా కోడూరు మండలం ఆనంవారిపల్లిలో వైకాపా బలపరిచిన అభ్యర్థులు నగదుతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైకాపా బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్‌లు దాఖలు చేసిన రెబల్ అభ్యర్థులను బరిలో నుంచి తప్పుకోవాలని... ఆ పార్టీ నేత హెచ్చరించారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ పశ్చిమగోదావరి జిల్లా సగం చెరువు సర్పంచ్ అభ్యర్థి మల్లుల తులసీ కృష్ణపై కొందరు ఒత్తిడి తీసుకురాగా..ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స తీసుకుంటున్నారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం కర్లపూడిలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని గ్రామకార్యదర్శి బెదిరించగా ఆ పార్టీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని.. ఎస్పీ అమిత్ బర్దార్‌ని కలిసి తెలుగుదేశం నేతలు కళావెంకట్రావ్, రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా పోరుమామిళ్లలో బెదిరింపులకు గురైన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి సుధాకర్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా లాలంకోడూరులో వార్డు అభ్యర్థిని బెదిరించిన కేసులో ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజును పోలీసులు అరెస్టు చేసి ఆపై..బెయిల్‌పై విడుదల చేశారు. కదిరి మండలంలో వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని... అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏరులై పారుతోన్న మద్యం, నగదు
పంచాయతీ ఎన్నికల వేళ అక్రమ మద్యం పెద్దఎత్తున తరలుతోంది. తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,430 మద్యం సీసాలను కృష్ణా జిల్లా వత్సవాయి చెక్‌పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 272 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా అయ్యవారిపల్లిలో ఓ దాబా హోటల్ వెనక భూమిలో పాతిపెట్టిన మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. పుట్టపర్తిలో ఒక లారీలో 32 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుత్తి శివార్లలో అక్రమంగా తరలిస్తున్న కర్ణటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.