అడవులు నరికేసి మనం ఇళ్లు కట్టుకుంటున్నాం. వీటి మూలానా అడవిలోని జంతువులకు ఆహార కొరత ఏర్పడింది. అన్ని జంతువులు ఎలాగోలా సర్దుకుంటున్నాయి కానీ, వానరాలు మాత్రం మానవాళిని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తున్నాయి. అంతే కాదు, ఇళ్లల్లోకి దౌర్జన్యంగా చొరబడి.. వాటికి నచ్చిన ఆహారాన్ని గిన్నెలు, డబ్బాలతో సహా ఎత్తుకెళతాయి. అడ్డొస్తే ఇకిలించి భయపెడతాయి. ఇంకా ఎక్కువ చేస్తే మనుషులని కూడా చూడకుండా రక్కేస్తాయి. అందుకే, కోతుల అరాచకాలను భరించలేక కర్ణాటక ప్రభుత్వం.. వాటి కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసింది.
కోతుల పోరు తాళలేక...
శివమొగ్గ జిల్లా, మలెనాడ్ ప్రజలు కోతుల పోరు తగ్గించమని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించింది. వాటికి ఆహారం దొరకకే ఇళ్లపైకి, పంటల్లోకి వస్తున్నాయి. అదే ఆహారం వాటికి సరిపడా దొరికితే.. వాటి మానాన అవి గడుపుతాయి అనుకుంది. అందుకే, కపిరాజుల కోసం రూ. 5 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక పార్కు నిర్మించింది.