రాష్ట్రంలో పురపాలక ఎన్నికల పండుగ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వడంతో నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నిజాంపేట్ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమయింది. అధికారులు 33 వార్డులకు గానూ 11 గదులను సిద్ధం చేశారు. బడంగ్‌పేట్ నామినేషన్ల సందడి మొదలైంది. 32 వార్డులు ఉండగా అందుకు అనుగుణంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ దాఖలు కేంద్రాలను కందుకూరు ఆర్డీవో రవీందర్ రెడ్డి సందర్శించారు. జవహర్‌నగర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి.. అభ్యర్థులను మాత్రమే కేంద్రాల్లోకి అనుమతించారు.
రంగారెడ్డి జిల్లాలోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో నేతలు జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. తొలిరోజు మణికొండ మున్సిపాలిటీలో పుప్పాలగూడ మాజీ సర్పంచ్ కస్తూరి నరేందర్ నామినేషన్ దాఖలు చేశారు. తుర్కయాంజల్, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలలోని నామినేషన్ కేంద్రాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు భారీ జనంతో ర్యాలీతో రాకూడదని పోలీసులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ నామినేషన్ల కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు పరిశీలించి పలు సూచనలు చేశారు. మెదక్ పురపాలక సంఘంలో పలువు నామినేషన్లు దాఖలు చేశారు.
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పురపాలికలో నామినేషన్ల పర్వం మొదలైంది. 25వ వార్డుకు జాడి శశికళ నామినేషన్ వేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నామపత్రాల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సందర్శించారు. బోధన్ మున్సిపాలిటీ 38 వార్డులకు సంబంధించి స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి పురపాలక కార్యాలయంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ శశాంక పరిశీలించారు. పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి , సుల్తానాబాద్ పురపాలక ఎన్నికలకు... పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో పన్నులు చెల్లించే వారితో పురకార్యాలయం సందడిగా మారింది. మహబూబూబాద్ 17వ వార్డుకు తెరాస అభ్యర్థినిగా యార్ల పుష్పలత.. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.