రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ( Job vacancies in Telangana ) 67 వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదిక సిద్ధం చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 52 వేల ఉద్యోగ ఖాళీలున్నట్లు అప్పట్లో మంత్రిమండలికి నివేదించారు. ఆ జాబితా సక్రమంగా లేదని, సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో జులై 19న మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాఠోడ్ సమీక్షించారు. ఆయా శాఖలు రూపొందించిన నివేదికలను పరిశీలించారు. శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది వివరాలను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు. కసరత్తులో భాగంగా దశాబ్దాల క్రితం నాటి ఉత్తర్వులను కూడా అధికారులు పరిశీలించారు.