వ్యవసాయ పనుల పెట్టుబడి సాయం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన ‘రైతుబంధు’ సొమ్మునంతా రైతులకు ఇచ్చి తీరాల్సిందేనని అన్ని బ్యాంకులను రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ‘‘రైతుబంధు’ సొమ్ము... పాత బాకీలకేనా?’ శీర్షికన మంగళవారం ‘ఈటీవీ భారత్’లో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రాష్ట్ర సహకార అపెక్స్ ఎండీ నేతి మురళీధర్, బ్యాంకుల ఉన్నతాధికారులతో మంగళవారం మంత్రి హరీశ్‌రావు అత్యవసర సమావేశం నిర్వహించారు.
స్పష్టమైన ఆదేశాలివ్వండి
రైతుబంధు సొమ్మును పాత బాకీలకు జమ చేసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇలా ఎందుకు చేస్తున్నారని మంత్రి హారీశ్‌రావు బ్యాంకర్లను ప్రశ్నించారు. పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఈ సొమ్మును పాత బాకీలకు జమ చేసుకోవద్దని.. ఈ మేరకు అన్ని బ్యాంకులూ తమ శాఖలకు వెంటనే స్పష్టమైన ఆదేశాలివ్వాలని సూచించారు. ఇప్పటికే ఎక్కడైనా రైతుల సొమ్మును పాత బాకీలకు జమ చేసుకున్నా తక్షణం రైతుల పొదుపు ఖాతాల్లోకి వేసి వారికి నగదు ఇవ్వాలన్నారు.