తెలంగాణ

telangana

ETV Bharat / city

AP Budget 2022: బడ్జెట్ బండికి సవాళ్లెన్నో!.. నేటి నుంచి అధికారుల స్థాయి చర్చలు - ap budget news

AP Budget 2022: కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. 2022-23 ఏడాదికి బడ్జెట్‌ రూపకల్పన కోసం.. వివిధ శాఖల నుంచి అంచనాలు సేకరించనుంది. సచివాలయంలో వారం పాటు వివిధ శాఖలతో వేర్వేరుగా ఆర్థిక శాఖ సమావేశాలు జరపనుంది. వచ్చే ఏడాదికి ఎంత మేర నిధులు అవసరమన్నదానిపై అంచనాలు సిద్ధం చేయనుంది.

ap budget 2022
ap budget 2022

By

Published : Jan 17, 2022, 10:40 AM IST

AP Budget 2022: ఆంధ్రప్రదేశ్​లో అనేక సవాళ్ల మధ్య కొత్త బడ్జెట్‌ రూపకల్పనకు కసరత్తు మొదలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనేక ప్రభుత్వశాఖలకు, సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగినా ఖర్చు అందుకు తగ్గ రీతిలో లేదు. నిధులు అందుబాటులో లేకపోవడం, ప్రతి ప్రభుత్వశాఖలో బిల్లులు పెండింగులో ఉండటం వంటి సవాళ్ల మధ్య పనులు ముందుకు సాగలేదు. పనులు చేసేందుకు, సరకులు సరఫరా చేసేందుకూ గుత్తేదారులు, సరఫరాదారులు వెనకడుగు వేస్తున్నారు.

ఆర్థిక పరిస్థితులు.. కరోనా సవాళ్లు..

మరోవైపు కరోనా మూడోదశ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త బడ్జెట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెండు మూడు ఆర్థిక సంవత్సరాలుగా బడ్జెట్‌ ప్రతిపాదనల మొత్తంలో పెద్దగా మార్పు లేదు. ఎప్పటికప్పుడు అంచనా పెరగాల్సి ఉన్నా.. ఆర్థిక పరిస్థితులు, కరోనా సవాళ్ల కారణంగా అనేక పరిమితులతో బడ్జెట్‌ రూపొందించాల్సి వస్తోందని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త బడ్జెట్‌ కసరత్తు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతోంది.

నేటి నుంచి సమావేశాలు..

ఏపీలో 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోపు ఉభయసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. ఎన్నికలు, కరోనా కారణంగా వరుసగా మూడేళ్లు తొలుత ఓటాన్‌ అకౌంట్‌ సమర్పించడమో లేదా ఆర్డినెన్సు తీసుకురావడం వల్ల ఇటీవల నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభకు సమర్పించే వీలు చిక్కలేదు. ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌ రూపకల్పనకు అవసరమైన ఏర్పాట్ల దిశగా ఆర్థికశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. నేటి నుంచి నుంచి 24 వరకు వారంరోజుల పాటు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశాలు ఏర్పాటుచేశారు.

ప్రాధాన్యతలు.. సర్దుబాట్లు..

వచ్చే సంవత్సర బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వ ఆలోచనలను - కేటాయింపులకు సంబంధించిన ఆయా శాఖల నుంచి ఉన్న డిమాండ్లను ఆర్థికశాఖ అధికారులు స్వీకరిస్తారు. ఆయా ప్రభుత్వ శాఖల ప్రాధాన్యాలు, వచ్చే ఏడాది నిధుల అవసరాలు, పథకాలకు కేటాయింపులు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు - ఖర్చు తీరు, లక్ష్యాలు ఎంతవరకు అందుకున్నారు లాంటి అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ ఉంటుంది. ఈ మేరకు సమావేశాలకు హాజరుకావాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి... అన్ని ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులకు సమాచారం. పంపారు. రోజూ అయిదారు ప్రభుత్వ శాఖలతో ఈ సమావేశాలు ఉంటాయి. ప్రతిపాదనలు స్వీకరించాక మరోసారి అధికారిక స్థాయిలో సమావేశాలు ఉంటాయి. ఆ సమావేశాల్లో ఎంత మేర సర్దుకోవాల్సి ఉంటుందో చెప్పి, ఆయా ప్రభుత్వశాఖల ప్రాధాన్యాలు తెలుసుకుంటారు.

తర్వాత స్థాయిలో ఆర్థికమంత్రి అన్ని ప్రభుత్వశాఖల మంత్రులతో బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చిస్తారు. అనంతరం తుది రూపు ఇస్తారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జెండర్‌ బడ్జెట్‌, పిల్లల బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. అంతకుముందు ఎప్పటి నుంచో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ కూడా సభకు సమర్పిస్తున్నారు. 2022-23 బడ్జెట్‌లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రాధాన్య పథకాలు-అమలు, కేంద్ర సాయంతో అమలుచేస్తున్న పథకాలు, గ్రామీణ మౌలిక సౌకర్యాల కల్పన, విదేశీ ఆర్థిక సాయంతో చేపడుతున్న పథకాలు- పురోగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికల అమలు తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ ఉంటుంది.

ఇదీచూడండి:గంటకు రూ.రెండున్నర లక్షలు.. రోజుకు రూ.అర కోటిపైనే..

ABOUT THE AUTHOR

...view details