బల్దియా ఎన్నికల్లో.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో ఒక బస్తీ నాయకుడు ప్రచారంలో అభ్యర్థి వెంటే తిరిగారు. చివరి నిమిషంలో అతను ప్రత్యర్థికి ఓట్లు వేయమంటూ ప్రచారం చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఇవేవీ పట్టించుకోని అభ్యర్థి.. ఓడిపోయినట్లు తెలియగానే ఆ బస్తీ నేతపై మండిపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటాక అతనితో గొడవకు దిగాడు. స్థానిక పెద్దల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది.
ప్రచారం చేయలే.. పైసలు పంచలే
నగర శివారు ఓ నియోజకవర్గంలో ప్రధాన డివిజన్‌లో రెండు ప్రధాన పార్టీలు హోరాహోరీ ప్రచారం చేశాయి. అభ్యర్థులు ఖర్చుకూ వెనుకాడలేదు. చోటా నేతలు కోరిందల్లా ఇచ్చారు. ఇందులో ఓ అభ్యర్థి ఓడిపోయారు. ఇంకేం.. గెలిపిస్తామంటూ భారీ నజరానాలు అందుకున్న వారిని పిలిపించి ఆదివారం సమావేశం పెట్టారు. అందులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రభస చేశారు. విషయం బయటపడితే పరువు పోతుందని కీలక నాయకుడు కలుగజేసుకుని అందర్నీ పంపేశారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లోనూ ఇదే తరహా పంచాయితీ నడిచింది. ఓడిన అభ్యర్థి వెంట తిరిగిన కొందరు నేతలు ప్రచారం చేయకుండా అవతలి పార్టీకి కోవర్టులుగా పనిచేశారంటూ ఓ వర్గం వివాదం లేవనెత్తింది. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించిన తరువాత ఇది నిజమేనని తేలటంతో ఆ నాయకులు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేసేలా అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓ డివిజన్‌లో గెలుపు ఖాయం అనుకున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. నగదు పంపిణీలో తలెత్తిన ఇబ్బందులే దీనికి కారణమంటూ ఆ అభ్యర్థి తన అనుచరులతో మంతనాలు ప్రారంభించారు. పంపిణీ బాధ్యతలు తీసుకున్న కొందరు సగమే ప్రజలకిచ్చారని, మరికొందరు ఆ డబ్బు సొంతానికి వాడుకున్నట్టు నిర్ధారించుకొని.. అదంతా తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడేం చేద్దాం
విజయం సాధించిన డివిజన్లలోనూ కొందరు అభ్యర్థులకు కొత్త చికాకులు ఇబ్బంది పెడుతున్నాయి. గెలుపు కోసం తామే పని చేశామంటూ ఓ వర్గం.. కాదు కాదు మేమే పనిచేశామని మరో వర్గం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని రెండు డివిజన్లలో ఇదే రకమైన గొడవలు రాగా అందరూ పార్టీ పెద్దలను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కొత్తగా కార్పొరేటర్‌గా బాధ్యతలు చేపట్టబోయే వారి తరఫున డివిజన్‌లో చక్రం తిప్పాలనుకునే నేతలు ఇటువంటి గొడవలకు కారణమవుతున్నారని ఓ పార్టీకి చెందిన నాయకుడు తెలిపారు.