గచ్చిబౌలి స్టేడియంలో ఐదో ఎడిషన్ హాఫ్ మారథాన్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం(Gachibowli stadium)లో నెబ్ స్పోర్ట్స్(NEB sports) ఆధ్వర్యంలో ఐదో ఎడిషన్ హాఫ్ మారథాన్(Half Marathon) నిర్వహించారు. 10కె, 5కె రన్‌లో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్(National Badminton coach Pullela Gopichand) హాజరై పరుగును ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌లో విజేతలుగా నిలిచినవారికి పతకాలను అందజేశారు.
బాలల దినోత్సవం(Children's day 2021) పురస్కరించుకుని చిన్నారుల కోసం ప్రత్యేకంగా 5కే రన్(5K run) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పరుగులో చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
"మీ అందరిని ఇక్కడ చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ఉదయాన్నే లేచి పరుగు కోసం ఇక్కడికి రావడం ఎంతో మంచి విషయం. చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్లను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఈ వయసులోనే ఆరోగ్యంపై దృష్టి సారిస్తే.. ఫ్యూచర్ చాలా బ్రైట్‌గా ఉంటుంది. అందరూ కలిసి రన్ చేస్తే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది"
- పుల్లెల గోపిచంద్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్
"ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోంది. కరోనా వల్ల ఈ మాట విలువ బాగా తెలిసొచ్చింది. గత రెండేళ్ల నుంచి ప్రజలంతా ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఆరోగ్యకరమైన ఆహారం తింటూ.. వ్యాయామం, యోగా వంటివి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ మారథాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవలం శారీరకంగానే గాక మానసికం ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నలుగురితో కలిసి మారథాన్‌లో పాల్గొనం ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు నేను నాలుగు సార్లు మారథాన్‌లో పాల్గొన్నాను. కరోనా వల్ల గత రెండేళ్లుగా మారథాన్లు నిర్వహించలేదు. ఆ సమయంలో నేను ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. ఇప్పుడు అందరితో కలిసి ఇలా పరుగుతీయడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొస్తే.. ప్రజల్లో వ్యాయామం పట్ల అవగాహన పెరుగుతుంది."
- రామ్, మారథాన్ రన్నర్
"బాలల దినోత్సవం కూడా కావడం వల్ల ఇవాళ.. పిల్లల కోసం 5కె రన్ కూడా నిర్వహిస్తున్నాం. ఎంతో మంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొంటున్నారు. వారితో పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా పరుగుతీస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్, పోలీసులు చాలా సహకరిస్తున్నారు. వారు వారి అథ్లెట్లను మారథాన్‌కు పంపించారు. నేను ఈ కార్యక్రమం చేయడానికి చాలా భయపడ్డాను. కరోనా భయంతో ఎవరూ రారేమోనని.. కానీ.. ఆ భయమే వాళ్లందరికి ఆరోగ్యంపై శ్రద్ధ కలిగేలా చేసింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు మారథాన్‌లో పాల్గొనే వారి సంఖ్య పెరిగింది."
- సురభి శాస్త్రి, ఎన్ఈబీ స్పోర్ట్స్ నిర్వాహకురాలు