రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు.. అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి పాడే ఉయ్యాల పాటలు, వివిధ రకాల పదార్థాలతో రుచికరంగా తయారు చేసే నైవేద్యాలు.. వెరసి తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేవే బతుకమ్మ పండుగ సంబురాలు (telangana bathukamma celebrations in 2021). మహాలయ అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మహిళలెంతగానో ముచ్చటపడి ఆడే బతుకమ్మను రోజుకో పేరుతో పిలుస్తూ.. తీరొక్క పూలతో పేరుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాలతో కొలుస్తారు. ఇవాళ ఐదో రోజు(Bathukamma day 5) సందర్భంగా అట్ల బతుకమ్మను(atla bathukamma) పేరుస్తారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు.
అట్ల బతుకమ్మ
ఐదో రోజున బతుకమ్మను 'అట్ల బతుకమ్మ'(atla bathukamma) అంటారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. బియ్యం పిండి, రవ్వతో ఈ అట్లను తయారు చేస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ ఈ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఐదో రోజును పురస్కరించుకొని తంగేడు, గునుగు, చామంతి, బంతి, గుమ్మడి, మందార పూలతో ఐదంతరాల బతుకమ్మను పేరుస్తారు. వలయాకార తాంబాలం లేదా ప్లేటులో ఈ ఐదంతరాల బతుకమ్మను పేర్చి... సాయంత్రం వేళలో కోలాటాలు చేస్తారు. బతుకమ్మను చుట్టూ పెట్టి... ఉయ్యాల పాటలు పాడుతారు. అనంతరం బతుకమ్మను గంగమ్మ చెంతకు చేర్చి... తమతో తీసుకొచ్చిన ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు.