కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పీవర్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇవాళ 704 బృందాలతో 48,797 ఇళ్లలో సర్వే నిర్వహించారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో ప్రతి రోజు జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్నవారి సర్వేను పెద్ద ఎత్తున చేపట్టాయి. ఒక్కో బృందంలో ఏఎన్ఎం ఆశావర్కర్, జీహెచ్ఎంసీ వర్కర్‌తో కూడిన సభ్యులు ఇంటింటికి తిరిగి సర్వేను చేపట్టారు. జ్వరంతో ఉన్న వారి వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావకాన్ని పిచికారీ చేస్తున్నారు.
కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వల్ల వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, ఇతరులకు వ్యాపింపజేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో ఫీవర్ సర్వేపై అధికారులతో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు. జిల్లాలో వెయ్యి ఇళ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందులో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల ఇళ్లను సర్వే చేయించామన్నారు. 6,120 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 240 ఆక్సిజన్‌తో కూడిన బెడ్లు ఉన్నాయని, ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా 600 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు.