రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. గతేడాది(2019-20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్‌లో రసాయన ఎరువుల కోటా పెంచాలని ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయశాఖ అడిగింది. ఇప్పటికే తెలంగాణలో ఎక్కువగా వినియోగిస్తున్నారని, వాటిని నియంత్రించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సూచించింది.
ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో వాడిన ఎరువులెన్ని, సాగైన విస్తీర్ణమెంత, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందనే అంశాలపై వ్యవసాయశాఖ వివరాలు సేకరించింది. ప్రపంచ దేశాల్లో సగటున ఎకరానికి 78.4, భారతదేశంలో జాతీయ సగటు 51.2, తెలంగాణలో 185 కిలోలు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇంత ఎక్కువగా వాడటానికి రాష్ట్రంలో భూసార పరీక్షల ఫలితాలు సరిగా లేకపోవడం, రైతుల్లో అవగాహనా లేమి అని అంచనా.
ఇంకా ఇంకా భాస్వరం వాడేస్తున్నారు
ఇప్పటికే కొన్ని ప్రాంతాల నేలల్లో భాస్వరం శాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంది. మోతాదుకు మించి వాడటం వల్ల అది నేలలో కరగకుండా నిల్వలు పేరుకుపోతున్నాయి. కరిగించడానికి ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా(పీఎస్‌బీ)ని వాడాలి. బదులుగా ఇంకా భాస్వరమే వాడుతున్నారని, పీఎస్‌బీని రైతులు కొనడం లేదని వ్యవసాయాధికారులు తెలిపారు.