కరీంనగర్లో బీటెక్ పూర్తి చేసిన ఓ యువతి ప్రాంగణ ఎంపికలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. ప్రారంభ వేతనమే రూ.25వేలు. పని చేయాల్సిన ప్రాంతం గచ్చిబౌలిలోని ప్రముఖ కంపెనీ. తల్లిదండ్రులను వదిలి హైదరాబాద్‌లో తెలియని చోట ఉంటోంది. సమాజంలో అక్కడక్కడా మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కొత్త ప్రదేశంలో ఉద్యోగం కత్తిమీద సామే. ఇలాంటి యువతులకు, ఐటీ కారిడార్‌కు వచ్చే మహిళలకు అండగా ఉంటున్నారు సైబరాబాద్ పోలీసులు.
డౌన్లోడ్ చేసుకుంటే చాలు..
ఇప్పటికే షీ టీం బృందాలు, బాలమిత్ర, షీ షటిల్, మార్గదర్శక్ వంటి కార్యక్రమాలతో ఐటీ ఉద్యోగులకు రక్షణగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీసులు... మరో కొత్త అస్త్రాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. మహిళా భద్రత కోసం 'షీ సేఫ్' యాప్‌ను రూపొందించారు. సొసైటీ ఫర్ సైబర్ సెక్యురిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో తీర్చిదిద్దిన ఈ అప్లికేషన్‌ను సైబరాబాద్ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు. మహిళలు, యువతులు.. తమ స్మార్ట్ ఫోన్స్‌లో 'షీ సేఫ్' అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు అందులో ఉండే సౌకర్యాలను పొందొచ్చు.
దినచర్యలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే..
ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగిస్తున్న వాళ్లు.. ప్లేస్టోర్ లోకి వెళ్లి 'షీ సేఫ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం వినియోగదారుని ఫోన్ నెంబర్, పేరుతో నమోదు చేసుకొని వినియోగించుకోవచ్చు. మహిళలు తమ దినచర్యలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాప్‌లో పొందుపర్చారు. ఎస్సీఎస్సీకు చెందిన మార్గదర్శక్‌ల చిరునామాను యాప్‌లో ఉంచారు. దీనివల్ల వినియోగదారులెవరైనా అవసరాన్ని బట్టి సంబంధిత మార్గదర్శక్‌ను సంప్రదించవచ్చు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు... మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీం బృందాల ఫోన్ నెంబర్లు, భరోసా కేంద్రం, సఖి సెంటర్, మెడికల్ ఎమర్జెన్సీ నెంబర్‌తోపాటు... భూమిక స్వచ్ఛంద సంస్థ టోల్ ఫ్రీ నెంబర్‌ను యాప్‌లో అందుబాటులో ఉంచారు.