‘‘రాష్ట్రం నుంచి ప్రస్తుత యాసంగిలో 24.74 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు(బాయిల్డు) బియ్యమే భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) తీసుకుంటుంది. మిగిలినవి ముడి(రా)బియ్యం మాత్రమే ఇవ్వండి’’ అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘‘ప్రస్తుతం కేంద్రం వద్ద 111.75 లక్షల మెట్రిక్ టన్నుల(ఎంటీల) ఉప్పుడు బియ్యం నిల్వలు ఉన్నాయి. వాటన్నింటినీ వినియోగించేందుకు సంవత్సరాలు పడుతుంది. ఉప్పుడు బియ్యాన్ని పరిమితంగా తీసుకోవటం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. యాసంగి(రబీ) ధాన్యం కేవలం ఉప్పుడు బియ్యానికే పనికి వస్తాయన్నది అశాస్త్రీయమైన అంశం’’ అని కేంద్రం ఆ లేఖలో పేర్కొంది. రాష్ట్రంలో 52.76 లక్షల ఎకరాల్లో వరిసాగు కావటంతో 1.29 కోట్ల ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనాలని నిర్ణయించింది. ఇప్పటికే 67 లక్షల ఎంటీలు కొంది. 80 శాతం వరకు ముడి బియ్యం ఇచ్చి, మిగిలిన 20 శాతం ఉప్పుడు బియ్యం ఇవ్వాలని యాసంగి సీజను ఆరంభానికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. 10 నుంచి 20 శాతం మాత్రమే ముడి బియ్యం ఇవ్వగలుతామని, మిగిలిన 80 నుంచి 90 శాతం ఉప్పుడు బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖకు కేంద్రం తాజాగా ప్రత్యుత్తరం రాసింది.
FCI RICE: 'ఉప్పుడు బియ్యం వద్దు.. ముడి సరకు ఇవ్వండి' - ఎఫ్‌సీఐ వార్తలు
రాష్ట్రంలో సేకరించిన ముడిబియ్యాన్ని మాత్రమే పంపాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రస్తుత యాసంగిలో 24.74 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు(బాయిల్డు) బియ్యమే భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) తీసుకుంటుందని వెల్లడించింది.
అది మిల్లర్ల వ్యవహారం
‘‘ముడి బియ్యం కావాలంటే ఫలానా రకం ధాన్యం, ఉప్పుడు బియ్యానికి మరో రకం కావాలనడానికి శాస్త్రీయ అధ్యయనాలు ఏమీ లేవు. ధాన్యాన్ని ముడి లేదా ఉప్పుడు బియ్యంగా మార్చడమన్నది మిల్లర్లకు సంబంధించిన వ్యవహారం. ఇందులో రైతులకు సంబంధం లేదు’’ అని కేంద్రం తేల్చి చెప్పింది. ఒప్పందం ప్రకారం ఎఫ్‌సీఐ అవసరాలకు తగినట్లుగా ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే వ్యవసాయ సీజను ఆరంభానికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐతో సమావేశం నిర్వహించి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒప్పందానికి అదనంగా ఉప్పుడు బియ్యాన్ని అనుమతించేది లేదని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది.