Father Complaint to HRC: ఓ మహిళా వలలో చిక్కుకున్న తన కన్న కొడుకును రక్షించుకునేందుకు... ఓ తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన బాబురావు ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. బాబురావుకు ఇద్దరు కుమారులున్నారు. అయితే.. రెండో కుమారుడు అలెక్స్ (19)ను అదే ప్రాంతంలో ఉంటున్న 30 ఏళ్ల మహిళ ట్రాప్ చేసిందని... బాబురావు ఆమె భార్యతో కలిసి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అలెక్స్‌ను.. ప్రేమ, పెళ్లి పేరుతో సదరు మహిళ తన వలలో వేసుకుందని బాబురావు ఆరోపించారు. తన కొడుకును తమ వద్దకు రాకుండా చూస్తోందని వాపోయారు. జూన్ 26న ఇంట్లో నుండి వెళ్లిన అలెక్స్... ఇంత వరకు తమ ఇంటికి రాలేదన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. మేజర్ అన్న కారణంతో పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమారున్ని తమకు ఇప్పించాలని అలెక్స్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ.. హెచ్చార్సీని వేడుకున్నారు.