వ్యవసాయ రంగంపై లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంది?
లాక్డౌన్ విధించే ముందు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాం. ప్రజలకు ఆహార కొరత రాకుండా, పంట అమ్ముకునేందుకు రైతులు ఇబ్బంది పడకుండా ప్రణాళికలు రూపొందించాం. మార్కెట్లు పెట్టుకోవడానికి రైతులకు అనుమతులు ఇచ్చాం. ఎక్కువ లారీలు వచ్చి గుమిగూడితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వ్యవసాయ మార్కెట్లను వికేంద్రీకరించాం. వినియోగదారులకు ఇబ్బంది రాకుండా సంచార మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చాం.
ఈసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది. కొనుగోలు సంబంధించి రైతులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
గ్రామాల్లోనే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ ఉండకుండా రైతులకు కూపన్లు ఇస్తున్నాం. శానిటైజేషన్ చేస్తున్నాం. రైతులు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
పండ్ల పంటలు కోసే అవకాశం లేదు. లాక్డౌన్ నేపథ్యంలో ఎగుమతి చేసే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
బత్తాయి, నిమ్మ లాంటి పండ్లను తెంపడానికి యంత్రాలు ఉండవు. కచ్చితంగా మనుషులే తెంపాలి. వ్యయసాయ పనులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ కరోనా నేపథ్యంలో కూలీలు భయపడుతున్నారు. వాళ్ల ఆందోళన న్యాయబద్ధమైనదే. పంటను రైతు కుటుంబమే కోసినా... ఆ పంటలకు మన రాష్ట్రంలో డిమాండ్ తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగుమతి చేయలేం. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు.
ఆ పంటను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుని పంపిణీ చేసే అవకాశం ఏమైనా ఉందా?
ఆ విధంగా కూడా ఆలోచించాము. ఆ పంట రవాణాకు ఎంతో మంది పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది.
మామిడి సీజన్ కూడా ప్రారంభమైంది. ఈసారి పంట ఉత్పత్తి కొంత తగ్గింది. ఈ మామిడి రైతులకు ఏం చేయబోతున్నారు?
ఈసారి మామిడి ఉత్పత్తి 30 శాతం తక్కువగా ఉంది. నేను కూడా మామిడి రైతునే. ఉత్పత్తి తక్కువ ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువై.. రైతుకు అధిక ధర లభించే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది. మన రాష్ట్రంలోనే మామిడికి డిమాండ్ ఎక్కువ. సమయం ఉంది కాబట్టి వీలైనంత వరకు మామిడి రైతులకు అసౌకర్యం లేకుండా చూస్తాం.