సకాలంలో పలకరించి అన్నదాతలకు ఆశలు కల్పించిన వర్షాలు.. ఆఖరున ఉగ్రరూపం దాల్చి ఆవేదన మిగిల్చాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు అధిక వర్షాలకు కళ్లముందే నల్లబడి, పూత, కాత రాలి నాశనమైపోతుంటే నిస్సహాయ స్థితిలో అప్పులే మిగిలాయంటూ రైతన్న బోరుమంటున్నాడు. మొన్నటివరకు పొలాల్లో ఉప్పొంగిన వరద.. నేడు రైతుల కళ్లలో నుంచి ఉబికి వస్తోంది. పంట నష్టాలపై పలు జిల్లాల్లో ‘ఈనాడు’ పరిశీలన జరపగా.. రైతుల తీవ్ర ఆవేదనతో కష్టాలను చెప్పుకొచ్చారు. ప్రభుత్వమే ఏదోలా ఆదుకుంటుందనే ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. వరి కంకులు రోజుల తరబడి నీళ్లలో నానడంతో తాలు గింజలు అధికంగా ఉన్నాయి. పత్తికాయలు వర్షపునీటికి నల్లబడటంతో కాటుకపట్టిన దూది వస్తోంది. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్తే రూ.2 వేల నుంచి 3 వేలు కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇంకా నీటిలోనే..
కొన్ని ప్రాంతాల్లో కూలీ ఖర్చులు వృథా అని పొలాలను పశువులకు వదిలేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కురిసిన కుంభవృష్టితో పలు ప్రాంతాల్లో పంటల నష్టం తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, కాల్వలు, నదుల పక్కనున్న వందలాది ఎకరాలు నీటమునిగి చాలా వరకూ నాశనమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీటిలోనే పంటలున్నాయంటే వర్షాలు మిగిల్చిన నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా. కానీ, చాలా ప్రాంతాల్లో అధిక వర్షాలతో పైర్లు తెగుళ్ల బారిన పడి పూత, కాత రాలిపోయాయి. వాటి నుంచి దిగుబడి సగమైనా వచ్చే పరిస్థితి లేదు.
ఆటో నడుపుకొన్నా బాగుండేది...
యువరైతు మురళీకృష్ణ గత మార్చి వరకూ ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించేవారు. లాక్‌డౌన్‌తో ఆ ఉపాధి పోవడంతో స్వగ్రామమైన నల్గొండ జిల్లా పెద్దకాపర్తికి వచ్చి 14 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి సాగుచేశారు. పక్కనే చెరువు ఉండటంతో వర్షాలకు అది కాస్తా పొంగి పొలం పూర్తిగా మునిగిపోయింది. ఇప్పటికీ వరదనీటిలోనే వరి పైరు ఉంది. రూ.6 లక్షలు అప్పు తెచ్చి పెట్టి పూర్తిగా మునిగిపోయానని.. ఏం చేయాలో దిక్కుతోచడం లేదని, ఆటో నడుపుకొన్నా నయంగా ఉండేదేమోనని మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీలకు సొమ్ము ఇవ్వలేక..
గతంలో పాడి పశువులను మేపుకొంటూ కుటుంబాన్ని పోషించుకునేదాన్ని. ఈ వానాకాలంలో తొలిసారి మాకున్న 3 ఎకరాల్లో పత్తి సాగుచేశాం. చెరువు నీరు పొంగి పంట నాశనమైంది. కొద్దిమేర పంట ఇంకా నీటిలో ఉంది.. అందులో అక్కడక్కడా వచ్చిన దూదిని తీయడానికి కూలీలకు సొమ్ము ఇవ్వలేక మేమే తీస్తున్నాం. పాఠశాలలు లేకపోవడంతో 9వ తరగతి చదివే కుమార్తెతో కలిసి నేనే దూది ఏరుతున్నా. - బైకాని భాగ్య, బోగారం, నల్గొండ జిల్లా
అప్పులే మిగిలాయి
మాకున్న 4 ఎకరాల్లో వరి, మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశా. వరదల్లో పత్తి చేను మునిగిపోయి కాయలు నల్లబడి నాణ్యతలేని దూది వచ్చింది. దాన్ని ఆరబెట్టి అమ్మితే పెట్టుబడిలో సగమైనా వచ్చేలా లేదు. వరి పొలం కూడా వరదలో మునిగింది. పెట్టుబడులు రాక అప్పులే మిగిలాయి. -ఆరె రేణుక, పోచన్నపేట, జనగామ జిల్లా
ప్రభుత్వం ఆదుకోవాలి