Yemmiganur Jatara: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వరస్వామి జాతర కోలాహలంగా సాగుతోంది. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ నెల 19న స్వామి వారి రథోత్సవం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. నాటి నుంచి నెల రోజులపాటు ఈ జాతరను జరుపుకుంటారు. సుమారు 300 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ జాతరను కేవలం రైతుల కోసమే నిర్వహించడం విశేషం. జాతరలో భాగంగా పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు వ్యవసాయం కోసం కోడెలు, ఎద్దులను కొనుగోలు చేస్తారు.
కాలం కలిసిరాక పంట నష్టపోయినా రైతులు బాగానే జాతరకు వస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనిముట్లు, పశువులను విక్రయిస్తాం. ఈ సారి పంట నష్టం వల్ల గిరాకీ అంతగా లేదు. గిట్టుబాటు ధర లభించడం లేదు. --- జాతరలో రైతులు
అట్టహాసంగా పోటీలు
పశువుల కొనుగోళ్లతోపాటు వ్యవసాయానికి అవసరమైన అన్ని పనిముట్లు ఈ జాతరలో అమ్ముతారు. నాగళ్లు, ఎడ్ల బండ్లు, చక్రాలు, ఎద్దుల అలంకరణ వస్తువులు ఇలా అన్నీ విక్రయిస్తారు. మరోవైపు వివిధ కేటగిరీల్లో రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను వీక్షించేందుకు జనం భారీగా వస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా పోటీలు, పద్యనాటకాల ప్రదర్శనలు నెలరోజుల పాటు అట్టహాసంగా జరుగుతాయి. పిల్లలకు బొమ్మలు, తినుబండారాల అమ్మకాలతో జాతర కిటకిటలాడుతోంది.
ఐదారేళ్లుగా ఈ జాతరకు వస్తున్నాను. వచ్చిన ప్రతిసారీ వివిధ రకాల పోటీల్లో పాల్గొన్నాను. ఈ జాతరలో ఇంత జనాన్ని చూడలేదు. ఈ ఊరి జాతరకు భారీగా జనం వస్తారు. రాష్ట్రం నుంచే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జాతరను చూడటానికి తరలివస్తారు. -- భక్తులు
ఎమ్మిగనూరు జాతరే జిల్లాలో మొదటి ప్రారంభమయ్యే జాతరగా చెబుతారు. దీని తర్వాతే మిగిలిన జాతరలు ప్రారంభమవుతాయి.
ఇదీచదవండి:Employees Allotments: కేటాయింపుల తర్వాత విధుల్లో చేరకుంటే యాక్షన్ తప్పదు..!