పంటల సాగు ప్రారంభానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ‘రైతుబంధు’ సొమ్మును బ్యాంకులు తీసేసుకుంటున్నాయి. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించలేదని, వారి పేరిట జమ అవుతున్న డబ్బులను పాత బకాయి ఖాతాలకు మళ్లిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు రైతుబంధు సొమ్ము ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ 57.60 లక్షల మంది పొదుపు ఖాతాల్లో రూ.6,013 కోట్లను రైతుబంధు కింద జమచేసింది. బ్యాంకుకెళ్లి అడిగితే ఆ సొమ్మును వారి పాత బాకీలో వేసేశామని, ఇక పొదుపు ఖాతాలో సొమ్మేం లేదని సిబ్బంది చెబుతున్నారు.
రైతు పంటరుణం తీసుకుంటే ఏడాదిలోగా ఎప్పుడైనా చెల్లించవచ్చనే నిబంధన ఉంది. నిజానికి గతేడాది (2020) వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు రూ.21 వేల కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారు. అవి కట్టడానికి ఇంకా గడువున్నా ముందుగానే రైతుబంధు సొమ్మును తీసేసుకున్నాయి. అంతకుముందు తీసుకున్న రుణాలను రైతులు చెల్లించకపోయినా వాటికింద జమ చేసుకుంటున్నాయి. 2018 డిసెంబరు నాటికి 42 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన రూ.28 వేల కోట్ల పంటరుణాలను మాఫీ చేస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస హామీ ఇచ్చింది. ప్రతీ రైతుకు ఎంత బాకీ ఉన్నా రూ.లక్ష వరకూ మాఫీ చేస్తామని తెలిపింది. వీరిలో రూ.25 వేలలోపు బాకీ ఉన్నవారందరికీ గతేడాది ప్రభుత్వం బ్యాంకులకు సొమ్మును విడుదల చేసింది. రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్నవారి తరఫున ఇంకా రూ.27,500 కోట్లను బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంది.
రుణమాఫీ పథకం కింద ఈ ఏడాది (2021-22)లో రూ.6 వేల కోట్లను ఇస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. అవి ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో 2018 నుంచి లక్షలాది మంది రైతులు పాత బాకీ కట్టి కొత్త రుణానికి రెన్యూవల్ చేసుకోలేదు. దీంతో బాకీ కట్టని రైతుల ఖాతాలను ఎగవేతదారుల జాబితాల్లోకి బ్యాంకులు చేర్చాయి. ఈ జాబితాలో పేరున్న రైతులకు మరో పొదుపు ఖాతా ఉంటే దానిని స్తంభింపజేసి అందులో జమయ్యే ప్రతీ పైసాను పాతబాకీ ఖాతాకు మళ్లిస్తున్నాయి. ఇందువల్లనే రైతుబంధు పేరుతో రైతులు పొదుపు ఖాతాల్లో జమ అయిన సొమ్ము పాతబాకీ ఖాతాల్లోకి వెళ్లిపోతోందని, సిబ్బంది మళ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. నిబంధనల ప్రకారమే ఇలా చేస్తున్నామని, పాతబాకీలు వసూలు చేయాలని బ్యాంకు సిబ్బందిపై ఉన్నతాధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆయన వివరించారు.
గత 3 సీజన్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదు