PRAWNS: ఆక్వాలో దాణా ఖర్చు పెరిగింది. విద్యుత్తు బిల్లులూ తడిసిమోపెడవుతున్నాయి. మరోవైపు జనవరి నుంచి రొయ్యల ధరలు కిలోకు రూ.200 వరకు తగ్గాయి. గత 20 రోజుల్లోనే ధర రూ.90 వరకు పడిపోవడంతో సాగు చేయాలా? మానాలా? అని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు ప్రారంభంలో చూపే ధరలకు.. చేతికొచ్చే సమయంలో ఇచ్చేదానికీ పొంతన ఉండటం లేదని, కావాలనే రేటు తగ్గిస్తున్నారని వాపోతున్నారు. ఇలాగైతే పంట విరామమే ప్రత్యామ్నాయమని ఆక్వా రైతు సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ధరల నిర్ణయంలో ఎంపెడా, మత్స్యశాఖ అధికారుల పాత్ర నామమాత్రంగా ఉందనే రైతులు విమర్శిస్తున్నారు.
కిలో రూ.600 నుంచి తగ్గుతూ
ఈ ఏడాది జనవరిలో 30 కౌంట్ రొయ్య ధర కిలో రూ.600 వరకు ఉంది. తర్వాత క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం రూ.400 స్థాయికి చేరింది. సగటున కిలో రూ.200 తగ్గింది. 50 కౌంట్ రొయ్యలకు కూడా ఇప్పుడు రూ.300 మాత్రమే దక్కుతోంది. పరిశ్రమలకు విద్యుత్తు కోతల అమలు సమయంలో కూడా వ్యాపారులు రొయ్యల ధరలను సగటున కిలోకు రూ.50 వరకు తగ్గించారు. తర్వాత కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు పెంచినా.. మళ్లీ తగ్గుదల మొదలైంది. 50, 60 కౌంట్ రొయ్యలను అడగటం లేదని.. బతిమాలితే ధర తగ్గించి కొంటున్నారని రైతులు చెబుతున్నారు. ఎంపెడా, మత్స్యశాఖ అధికారుల నియంత్రణ కొరవడటంతో ధరలు ఇష్టారాజ్యంగా తగ్గించేస్తున్నారని పలువురు రైతులు మండిపడుతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే 30 కౌంట్ రొయ్య ధర రూ.510 నుంచి రూ.420కి పడిపోయిందని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చెయ్యేరు రామలింగేశ్వర ఆక్వా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. సగటున టన్నుకు రూ.లక్షకు పైగా నష్టపోతున్నామని వాపోయారు. 'రైతులు కిలో రొయ్యల ఉత్పత్తికి సగటున రూ.300 వరకు ఖర్చు చేస్తున్నారు. అమ్మకం ద్వారా సగటున (అన్ని రకాల కౌంట్ కలిపి) కిలోకు రూ.250 నుంచి రూ.270 మాత్రమే వస్తోంది. కిలోకు రూ.40 చొప్పున నష్టపోతున్నాం' అని ఒంగోలుకు చెందిన రైతు హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పెరిగిన పెట్టుబడి ఖర్చులు..
ఆక్వా రైతులకు విద్యుత్తు భారం పెరిగింది. గతంలో యూనిట్‌కు ఛార్జీ రూ.1.50 ఉండగా.. ఇప్పుడు రూ.4 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఆక్వా జోన్లలో సాగు చేసే వారికి పదెకరాల వరకే రాయితీని పరిమితం చేయడంతో పలువురు రైతులకు రూ.లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. రొయ్యల దాణా ఖర్చూ భారీగా పెరిగింది. 2021 ఆగస్టుతో పోలిస్తే కిలోకు రూ.17 చొప్పున అధికమైంది. ప్రభుత్వ ఆదేశాలతో కిలోకు రూ.2 చొప్పున తగ్గించారు. రొయ్యల చెరువుల్లో వాడే రసాయనాల ధరలూ భారీగానే పెరిగాయి.
రెండు పంటల నుంచి ఒక పంటకు..