వ్యవసాయ పనులు చేపట్టేందుకు వాతావరణం అనుకూలించడంతో ధాన్యం రైతులు తమకు రావాల్సిన సొమ్ము కోసం ఎదురు చూస్తున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. కొనుగోలు చేసిన నాలుగైదు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ కావాల్సి ఉన్నా.. 15 రోజులకుపైగా సమయం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని తొలుత అంచనా వేశారు.
యాసంగి సీజన్‌లో ఉప్పుడు బియ్యమే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం.. సాధారణ బియ్యం కావాలని కేంద్రం కోరడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో వ్యాపారులు భారీగా కొనుగోలు చేశారు. మరో అయిదారు లక్షల టన్నులకు మించి ధాన్యం విక్రయానికి రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 6,609 కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటికే 6,375 మూసివేశారు. ఆలస్యంగా వరి నాట్లు వేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ధాన్యం విక్రయానికి వస్తుందని అధికారులు చెబుతున్నారు.