తెలంగాణ

telangana

ETV Bharat / city

Amaravathi Case: 'అమరావతిపై తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదు' - amaravathi Farmers counter on govt

Amaravathi Case: రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదంటూ... అమరావతి రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. తీర్పు అమలు చేయకపోవడానికి బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. కోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులను ప్రభావితం చేస్తున్న ప్రభుత్వ పెద్దలనూ శిక్షించాలని విన్నవించారు.

Amaravathi
Amaravathi

By

Published : Apr 23, 2022, 7:39 AM IST

Amaravathi Case: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని.. ఇందుకు బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలంటూ శుక్రవారం హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. యర్రబాలెం గ్రామానికి చెందిన రైతు దోనె సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు. కోర్టు తీర్పు అమలు చేయకుండా అధికారులను ప్రభావితం చేస్తున్నందుకు ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, జీఏడీ ప్రత్యేక సీఎస్‌ జవహర్‌రెడ్డి, అప్పటి న్యాయశాఖ కార్యదర్శి వి.సునీత, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, రహదారులు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి వై.శ్రీలక్ష్మి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ పూర్వ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

రాజధాని అమరావతిని నిర్మించాలని, రాజధాని నగరం, రాజధాని ప్రాంతంలో కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలను ఆదేశిస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి 3న తీర్పిచ్చింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తేల్చిచెప్పింది. ఆ తీర్పు ప్రకారం అధికారులు వ్యవహరించకపోవడంతో రైతులు కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు.

న్యాయస్థానం తీర్పును అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వంగా ఉల్లంఘించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిలో అధికారులతోపాటు ముఖ్యమంత్రి, మంత్రుల పాత్ర ఉన్నందున వారినీ కోర్టుధిక్కరణ కింద శిక్షించాలన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేయడం మంత్రివర్గ బాధ్యత అన్నారు. అధికారుల వెనుక మంత్రులు ఉండి కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా చూస్తున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి, మంత్రులేనన్నారు. వారు న్యాయపాలనకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ప్రతివాదులుగా పేర్కొన్న మంత్రులూ కోర్టుధిక్కరణ చట్టం సెక్షన్‌ 2(6) ప్రకారం శిక్షకు అర్హులన్నారు.

  • రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారంలో అధికారులు విధులు నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ చేస్తామని హైకోర్టు తీర్పులో పేర్కొందని గుర్తుచేశారు. భూసమీకరణ పథకం నిబంధనల ప్రకారం.. నిర్దిష్ట సమయం విధిస్తూ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ధర్మాసనం అధికారులను ఆదేశించిందన్నారు. ఇప్పటి వరకు పనులను చేపట్టలేదన్నారు. ఇది కోర్టుధిక్కరణ కిందకు వస్తుందన్నారు. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో రాజధాని ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పౌరులకు ఉచిత వైద్య సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు దక్కడం లేదన్నారు.
  • ఏపీసీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 61 ప్రకారం ‘టౌన్‌ ప్లానింగ్‌ స్కీమ్స్‌’ను అమలు చేయకుండా కోర్టుధిక్కరణకు పాల్పడ్డారన్నారు.
  • భూములిచ్చిన రైతులకు రహదారులు, నీటి వసతులు, విద్యుత్‌, ఇతర మౌలిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారన్నారు.
  • ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని న్యాయస్థానం తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు ప్రతివాదులను కోర్టుధిక్కరణ కింద శిక్షించాలని కోరారు.

సీఎస్‌ అఫిడవిట్‌ను తిరస్కరించండి

రాజధాని అమరావతిలో పనులు పూర్తి చేయడానికి 60 నెలల సమయం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఇటీవల దాఖలు చేసిన అఫిడవిట్‌ను తిరస్కరించాలని కోరుతూ రైతులు డి.సాంబశివరావు, మరొకరు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. సీఎస్‌ అఫిడవిట్‌ను పరిశీలిస్తే.. న్యాయస్థానం ఆదేశాల మేరకు అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా లేదని స్పష్టమవుతోందన్నారు. కోర్టుధిక్కరణ కేసు నుంచి తప్పించుకోవడానికే న్యాయస్థానం నిర్దేశించిన నెలకు ఒక రోజు ముందు అఫిడవిట్‌ వేశారన్నారు. కాలపరిమితి విధింపును తొలగించాలని కోరారన్నారు. ప్రధాన మౌలిక వసతుల నిర్మాణాలను నెలలో పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేశారన్నారు.

వారి వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థ ప్రతిష్థను దిగజార్చారు

‘రాజధాని నిర్మాణానికి హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్నారు. చట్టాలు చేయకుండా శాసన వ్యవస్థను న్యాయస్థానాలు ఆపలేవని వ్యాఖ్యానించారు. కోర్టులు చట్టాలు చేయకుండా అడ్డుకుంటున్నాయనే సందేశాన్ని ప్రజలకు పంపారు. ఈ తీరు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను కించపరచడమే కాదు కోర్టు ఆదేశాలను ధిక్కరించడం కూడా అవుతుంది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా హైకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పారు. శాసనసభ వేదికగా న్యాయవ్యవస్థపై దాడి చేశారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సీఎస్‌ వేసిన అఫిడవిట్‌ను తిరస్కరించండి’ అని కోరారు.

'హైకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. కోర్టు ధిక్కార పిటిషన్లు పడకుండా ఉండేందుకే.. సమయం కావాలని కోరారు. నిధుల కొరత అంటూ జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తీర్పుపై అధ్యయనం చేసి అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.అఫిడవిట్‌లోని అంశాలు పరిశీలిస్తే హైకోర్టు తీర్పు అమలు చేసే ఉద్దేశం లేదు. తీర్పు అమల్లో నిర్దేశించిన సమయాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు.' - పిటిషనర్లు

Govt Affidavit on Amaravathi Development: రాజధాని అమరావతిలో నిలిచిపోయిన ప్రధాన మౌలిక వసతుల పనులు మొదలుపెట్టడానికి.. 8 నెలల సమయం పడుతుందని..పూర్తి చేయడానికి 60 నెలలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కోర్టు చెప్పినట్లుగా నెలరోజుల్లో మౌలిక వసతులు పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపింది. రాజధాని కేసులో తీర్పు సందర్భంగా... అమరావతిలో నెల రోజుల్లో మౌలిక వసతులు కల్పించాలని..3నెలల్లోనే అభివృద్ధి చేసిన స్థలాలు రైతులకు ఇవ్వాలని, 6 నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 21 పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసింది. దానికి అనుబంధంగా 190 పేజీల పత్రాలు జతపరిచింది.

ఇదీ చదవండి:విద్యార్థినిపై దాడి కేసులో ప్రేమోన్మాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నాలుగేళ్ల చిన్నారిని ఇటుకతో కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు!

ABOUT THE AUTHOR

...view details