Lands value Guntur: ఏపీలోని గుంటూరు జిల్లా కేంద్రానికి సమీపంలోని భూములన్ని జిల్లా తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వెంట ఈ పొలాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ భూములు ఎకరా ప్రభుత్వం ధర 9లక్షల లోపే ఉండేది. అయితే సీఆర్డీఏ ఏర్పడిన తర్వాత దాని పరిధిలోని భూముల ధరలను ప్రభుత్వం పెంచింది. అధికారులు తెలిసి చేశారో, తెలియక చేశారో గానీ.. ఈ ప్రాంతంలో ఎకరం విలువ నాలుగున్నర కోట్ల నుంచి 7 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా ఇక్కడ భూమి కొంటే 45 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకూ రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 2 లేదా 3కోట్లకు అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ కింద ప్రభుత్వానికి కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకూ చెల్లించాలి. ఇక రైతుకు మిగిలేదేమీ ఉండదు. సీఆర్డీఏ పరిధిలో ఎక్కడా కూడా వ్యవసాయ భూములు ఇంత ధర లేవు. ఈ ప్రాంతంలో కనీసం మౌలిక వసతులు కూడా సరిగా లేవు. అలాంటి చోట అధిక విలువ నిర్ణయించటం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.