సాంకేతిక లోపాలు... సిబ్బంది తప్పిదాలు వెరసి అర్హులైన రైతులను రైతుబంధుకు దూరం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో భూ దస్త్రాల నిర్వహణలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వరంగల్ అర్బన్, గ్రామీణం, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు అనేక ప్రాంతాల్లో వేలాది మంది రైతులు రైతుబంధు కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జోగులాంబ జిల్లాలో ప్రాజెక్టుల కింద భూ సేకరణలో భూములు పోయిన రైతుల వివరాలు కూడా రైతుబంధు జాబితాలో కనిపించడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములు ఇచ్చి నష్టపోయిన తాము రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ సాయానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాసంగిలో వచ్చి ఇప్పుడు రాకపోవడమేంటి?
యాసంగిలో రైతుబంధు డబ్బులు వచ్చిన వారిలో కొందరికి నేటికీ సాయం అందకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద ఉన్న సమాచారంలో తమ భూముల వివరాలు లేవని తెలిసి వారు కంగుతింటున్నారు. దీంతో వెంటనే రెవెన్యూ సిబ్బందిని కలుస్తున్నారు. రెవెన్యూశాఖ పోర్టల్‌లో ఆయా రైతుల భూముల వివరాలు లేకపోవడం లేదా రైతు ఖాతాకు మరో ఖాతా అనుబంధంగా జతచేరడం, కొన్ని సర్వే నంబర్లు పూర్తిగా ఆన్‌లైన్‌లో లేకపోవడం లాంటి లోపాలు మండలాల్లో కనిపిస్తున్నాయి.