అమరావతి పరిరక్షణ కోసం 'మహా పాదయాత్ర' అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీలోని గుంటూరులో మహా పాదయాత్ర జరిగింది. గుంటూరు నగరంలోని వివిధ వర్గాల ప్రజలతో పాటు రాజధాని రైతులు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెదేపా, వామపక్షాల నేతలు కూడా ఈ పాదయాత్రలో పాల్గొని అమరావతికి సంఘీభావం ప్రకటించారు.
ఉద్యమం ఉగ్రరూపం..
విద్యానగర్ సమీపంలోని శుభం కళ్యాణ మండపం నుంచి గుజ్జనగుండ్ల, హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మిపురం మీదుగా సాగిన పాదయాత్ర లాడ్జ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ముగిసింది. అక్కడ మానవహారంగా ఏర్పడి పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమరావతి ఐకాస నేతలు... ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో ప్రజలకు కనీసం ఇసుక ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఎలా కడతారని ఐకాస నేత గద్దె తిరుపతిరావు ప్రశ్నించారు. కరోనా కారణంగా ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నామని.. ఇకపై అమరావతి ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తోందని హెచ్ఛరించారు.
అమరావతిలోనే రాజధాని ఉండాలి: నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. అమరావతిలోనే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు కేంద్రం భరించాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పెద్ద మనిషిగా ఉన్న వెంకయ్యనాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఏపీకి, అమరావతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల ఏడుపు దేశానికి మంచిది కాదని... ఆడవారిని ఏడిపించిన రావణాసురుడు, ధుర్యోదనుడు నాశనమైనట్లు.. వైకాపా సర్కారు పతనం అవుతుందని హెచ్చరించారు.
మార్చాలంటే చర్చించాల్సిందే: గల్లా జయదేవ్
రాజధాని అంశం కేంద్రం పరిధిలోనే ఉందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే పార్లమెంటులో చర్చించటం తప్పనిసరన్నారు. ఇవాళ గుంటూరులో ఉద్యమించినట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయేతర ఐకాస నేత శైలజ అన్నారు.
ఇదీ చదవండి:రైతుల ఆదాయం పెంచేందుకే సంస్కరణలు: మోదీ