కర్ణాటకలో పేరుగాంచిన డబ్బీ బాడిగ రకం మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది. ఏపీలోని గుంటూరు మిర్చియార్డులో క్వింటాకు రూ.36,000 వరకు ధర లభించింది. యార్డు చరిత్రలో డబ్బీ బాడిగ మిర్చికి ఇంత ధర పలకడం ఇదే ప్రథమం. అంతర్జాతీయ మార్కెట్లో ఈ రకం మిర్చికి మంచి డిమాండ్ ఉంది. కర్నూలు జిల్లా పంజాముల మండలం రెడ్డిపల్లెకు చెందిన మాయలూరి ప్రసాదరెడ్డి.. 131 బస్తాలు యార్డుకు తీసుకొచ్చి ఒకే లాట్లో అమ్మకానికి పెట్టగా.. క్వింటాకు రూ.36,000 ధర లభించింది.
రికార్డు ధర పలికిన మిర్చి.. క్వింటా రూ.36,000
ఏపీలోని గుంటూరు మిర్చియార్డులో.. బాడిగలోని మేలు రకం మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటా రూ.36వేలకు అమ్ముడుపోయింది. మొత్తం 131బస్తాలు విక్రయించగా.. రూ.23లక్షల 40వేల రూపాయలు వచ్చాయి. అందులో కమీషన్లు, పన్నులు పోగా రూ.21లక్షలు చేతికి వచ్చాయని ప్రసాదరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
భువనేశ్వరి ట్రేడర్స్ అనే కమీషన్ ఏజెంట్ ద్వారా ఆర్.కె. ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి సంస్థకు మిర్చిని విక్రయించారు.‘ఇంత పెద్దమొత్తంలో ధర పలుకుతుందని ఊహించలేదు. రూ.30,000 పడుతుందనుకున్నా. రూ.6000 అదనంగా లభించింది’ అని ప్రసాదరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం 8 ఎకరాల్లో డబ్బీ మిర్చి సాగుచేయగా తొలి కోతలో 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. నాణ్యత బాగుండడంతో మంచి ధర పలికిందని చెప్పారు. మంత్రాలయానికి చెందిన ఓ రైతు సోమవారం తీసుకొచ్చిన ఇదే రకం మిర్చికి రూ.30,000 ధర పలికింది.
ఇదీ చదవండి:తెలంగాణ సోనాతో.. మధుమేహం నియంత్రణ