తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చి రాష్ట్రానికి చిన్నమ్మగా నిలిచిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న రాత్రి కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురైన ఆమె హఠాన్మరణం చెందారు. 2009 నుంచి 2014 వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఆమె వ్యవహరించడం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా మారింది.
రాష్ట్రానికి అండగా
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉండగా ఆమె మాట మార్చకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్ల బిల్లు ఆమోదం పొందింది. ఉద్యమ సమయంలో సుష్మా స్వరాజ్ పార్లమెంట్ వెలుపలా, లోపలా తెలంగాణ వాదానికి అండగా నిలిచారు. దిల్లీలో జంతర్ మంతర్, ఏపీ భవన్ వద్ద జరిగిన ఆందోళనల్లో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో జరిగిన ఉద్యమ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
నేను .. మీ చిన్నమ్మను
2017 నవంబర్ 28న హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు విదేశాంగ మంత్రి హోదాలో ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంలోనూ తాను తెలంగాణకు చిన్నమ్మనంటూ పునరుద్ఘాటించారు. రాష్ట్రంతో ఉన్న అనుబంధాన్ని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.