రాష్ట్ర ప్రభుత్వం (telangana government) ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ‘రైతు జీవిత బీమా’ (Rythu Bheema) పథకం 22 లక్షల మంది అన్నదాతలకు అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు మొత్తం 57.79 లక్షల మంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నట్లు ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూశాఖ వ్యవసాయశాఖకు వివరాలిచ్చింది.
వీరిలో 35.64 లక్షల మందికే ‘భారతీయ జీవిత బీమా సంస్థ’(ఎల్‌ఐసీ)కి గత నెల 14 నుంచి ఆర్నెల్ల కాలానికి జీవిత బీమాను వర్తింపజేస్తూ వ్యవసాయశాఖ ప్రీమియం చెల్లింది. వీరిలో 31.58 లక్షల మందికి గతేడాది(2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకూ) జీవిత బీమా ఉండగా ఈ ఏడాది మళ్లీ పొడిగిస్తూ(రెన్యువల్) ప్రీమియం కట్టారు. మరో 4.06 లక్షల మంది పేర్లను కొత్తగా నమోదు చేశారు. వీరిలో 1.06 లక్షల మంది రైతులు గతేడాది(2020-21 పాలసీ సంవత్సరం)లో అర్హత ఉన్నప్పటికీ నమోదు చేయించుకోనందున ఈఏడాది వారి పేర్లను చేర్చారు. మిగిలిన 3 లక్షల మంది 2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 3 వరకూ కొత్త భూములు కొనడం లేదా వారసత్వంగా భూములు పొంది ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదైన వారుగా ఉన్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసులోపు ఉన్నవారే దీనికి అర్హులు.
ఈ పరిమితిలో లేరని రాష్ట్రవ్యాప్తంగా 15,25,656 లక్షల మంది(26.4 శాతం)కి ప్రీమియం చెల్లించలేదు. వీరుకాక మరో 6.75 లక్షల మంది రైతులను ఇందులో చేర్చకపోవడంతో మొత్తం 22 లక్షల మందికి వర్తించలేదు. గతనెల 13 వరకూ ఈ పథకం కింద అర్హులైన మొత్తం 32.73 లక్షల మందిలో 1.15 లక్షల మంది రైతుల పేర్లను వయసు 59 ఏళ్లు నిండటం లేదా చనిపోవడంతో ఈ ఏడాది తొలగించారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్నవారు, ఆర్థికంగా బాగున్న 6.75 లక్షల మంది వివరాలివ్వడానికి ఆసక్తి చూపలేదు. గతనెల 3 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన పట్టాదారులు, ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా కలిగిన వారిలో అర్హుల సంఖ్య 35.64 లక్షల మందికి పరిమితమైంది. ఈ ఏడాది నుంచి ఆర్నెల్ల కాలానికే జీవితబీమా ప్రీమియంను వ్యవసాయశాఖ చెల్లించింది. వచ్చే ఆర్నెల్ల తరవాత భూములు అమ్ముకున్నవారు, 59 ఏళ్ల వయసు నిండినవారిని తొలగించి మిగతావారికి మాత్రమే ప్రీమియం కట్టేందుకు ఆర్నెల్ల నిబంధనను కొత్తగా పెట్టారు.
గతేడాదే పేరు తీసేశారు