తెలంగాణ

telangana

ETV Bharat / city

Justice Hima Kohli: మధుర జ్ఞాపకాలతో వెళుతున్నా - హైదరాబాద్​ తాజా వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ హిమా కోహ్లికి రాష్ట్ర హైకోర్టు, బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికాయి. తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ మధుర జ్ఞాపకాలను మిగిల్చాయని జస్టిస్ హిమా కోహ్లి పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా మరో 13 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు తెలిపారు.

Farewell
వీడ్కోలు

By

Published : Aug 28, 2021, 3:29 AM IST

Updated : Aug 28, 2021, 7:00 AM IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాద్‌ వచ్చి అతి తక్కువ కాలమే అయినా మధురమైన జ్ఞాపకాలను వెంట తీసుకెళుతున్నానని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి వ్యాఖ్యానించారు. ఆధునిక నగరమైనా గొప్ప సంస్కృతి, సంప్రదాయాలతో నిండి, ఆప్యాయతానురాగాలు పంచే వ్యక్తులు ఇక్కడ ఎందరో ఉన్నారని కొనియాడారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళుతున్న జస్టిస్‌ హిమా కోహ్లికి ఫుల్‌కోర్టు, బార్‌ అసోసియేషన్‌లు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికాయి.

రోజూ యుద్ధమే

1980లో స్వతంత్రంగా న్యాయవాద వృత్తి ప్రారంభించానని జస్టిస్‌ కోహ్లి చెప్పారు. దిల్లీలాంటి నగరంలో మహిళగా న్యాయవాద వృత్తిలో రాణించడం సవాలే అని, అయినా సవాళ్లు లేకుండా ఏ విజయమూ దక్కదని వ్యాఖ్యానించారు. 22 ఏళ్ల న్యాయవాద వృత్తిలో, 15 ఏళ్లు జడ్జిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఏ వృత్తిలో అయినా రాణించడానికి కృషి, అంకితభావం, నిజాయతీ ముఖ్యమన్నారు. తల్లిదండ్రులు ఎస్‌.ఎన్‌.కోహ్లి, మొహిందర్‌ కొహ్లి, సోదరి నీలుల మద్దతు మరువలేనిదన్నారు. విచారణ సమయంలో న్యాయవాదులు కీలకమైన విషయాలను చెప్పి సహకరించాలన్నారు. బెంచ్‌ దిగాక న్యాయమూర్తులకు అసలైన పని ఉంటుందని, ఆ రోజు ఉత్తర్వులు, రిజర్వు చేసిన తీర్పులతో రోజూ యుద్ధమే జరుగుతుందన్నారు.

విక్రమాదిత్యుడి సీటులాంటిది

విక్రమాదిత్యుడి సీటులాంటిదే జడ్జి సీటు అని, అందులో కష్టాలున్నా, పనిలో స్వచ్ఛత, కార్యశీలత ఉంటాయని జస్టిస్‌ కోహ్లి అన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతున్నట్లు తెలిసిన మిత్రులు ఈ హైకోర్టు ఫొటోలను పంపారని, ఈ భవనం తన మనసులో చెరగని ముద్ర వేసిందని ఆమె పేర్కొన్నారు. వందేళ్ల ఈ భవనంలో ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించడం ఎవరికైనా గర్వకారణమేనన్నారు. మహిళా ప్రధాన న్యాయమూర్తి అని కాకుండా సహచర న్యాయమూర్తులు సంపూర్ణ మద్దతిచ్చారని, అలాగే బార్‌ కూడా సహకరించిందంటూ వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టులో న్యాయమూర్తుల కొరత కొనసాగుతుండగా, పెండింగ్‌ కేసులు 2.32 లక్షలు ఉన్నాయన్నారు. తానున్న ఏడు నెలల్లో ఆరుగురు జిల్లా జడ్జీలను, బార్‌ నుంచి ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సిఫారసు చేశానన్నారు. మరో ఏడుగురి నియామకాలు త్వరలో జరగనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుందని జస్టిస్‌ కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

వీడ్కోలు ఉంటుందనుకున్నా

సెప్టెంబరు 1న వీడ్కోలు ఉంటుందనుకున్నానని, అయితే సుప్రీంకోర్టులో సేవచేసే అవకాశం కల్పించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, కొలీజియానికి జస్టిస్‌ కోహ్లి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో ఈ కార్యక్రమానికి హాజరుకాని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జస్టిస్‌ హిమా కోహ్లి సేవలను జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విభు భక్రు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వరరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి, జస్టిస్‌ కోహ్లి సోదరి నీలు పాల్గొన్నారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ ముంతాజ్‌ బాష, కార్యదర్శి కల్యాణ్‌రావు, సృజన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:love marriage: ప్రేమ పెళ్లి.. అంతలోనే తల్లిదండ్రుల ఎంట్రీ.. ఆ తర్వాత..!

Last Updated : Aug 28, 2021, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details