తెలంగాణ

telangana

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

By

Published : Jun 4, 2021, 10:22 AM IST

Updated : Jun 4, 2021, 12:17 PM IST

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

10:20 June 04

ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

ప్రఖ్యాత సాహితీవేత్త కాళీపట్నం రామారావు ఏపీలోని శ్రీకాకుళంలో పరమపదించారు. ఈ రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. 1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించిన ఆయన పూర్తిపేరు.. కాళీపట్నం వెంకటసూర్య రామసుబ్రహ్మణ్యేశ్వరరావు. కారా మాస్టారుగా ప్రఖ్యాతి పొందారు. విశాఖ సెయింట్‌ ఆంథోనీ హైస్కూల్‌లో చాలా ఏళ్లపాటు టీచర్‌గా పనిచేసి 1979లో పదవీ విరమణ చేశారు.  

పోస్టుకార్డుపై మొదటి రచన..

కారా మాస్టారు మొదటి లఘుకథ "చిత్రగుప్త".. పోస్టుకార్డుపై రాయడం విశేషం. ఎన్నో రచనలు చేసిన ఆయన.. ఒకానొక సమయంలో తన రచనలతో సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే 1955లో రచనలు ఆపేశారు. 8 ఏళ్ల విరామం తర్వాత 1963లో 'తీర్పు'తో మళ్లీ రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1960 దశకం చివరిలో ఆయన అనేక రచనలు చేశారు. మహదాశీర్వచనము, వీరుడు-మహావీరుడు, ఆదివారం, హింస, నోరూమ్, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవనధార, కుట్ర లాంటి అనేక రచనలు చేశారు. తొలినాళ్లలో వరుసగా కథలు రాసిన కారా మాస్టారు.. ఆ తర్వాత ఏడాదికి ఒకటి, రెండుతో సరిపెట్టారు. ఆయన రచనలు ఇంగ్లీష్‌, రష్యన్‌ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. కారా మాస్టారు రచనలు.. ఎక్కువగా సామాన్య, మధ్య తరగతి జీవితాల విజయాల్ని ప్రతిబింబిస్తాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను విశ్లేషించడంలోనూ ఆయన దిట్ట. విప్లవ రచయితల సంఘంలో కార్యనిర్వాహక సభ్యుడిగానూ వ్యవహరించారు.

యండమూరి గురువు..

1997లో కారా మాస్టారు శ్రీకాకుళంలో 'కథానిలయం' ప్రారంభించారు. ఈ నిలయం.. యువతకు గ్రంథాలయంగా, పరిశోధన కేంద్రంగా ఉపయోగపడుతోంది. ఇందులో వార పత్రికలు, మాస పత్రికలు, తెలుగు మ్యాగజైన్స్‌ కలిపి 5 వేలకు పైగానే ఉంటాయి. గత 15 ఏళ్లుగా రచనలు తగ్గించిన కారా మాస్టారు.. ఇతర రచయితల లఘుకథల ముద్రణలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కారా మాష్టారు రాసిన 'యజ్ఞం తొమ్మిది' కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్ దక్కింది. రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డు, లోక్‌ నాయక్‌ ఫౌండేషన్ అవార్డు ఆయన్ను వరించాయి. 1993లో అమెరికాలో జరిగిన తానా తెలుగు మహాసభలకు కారా మాస్టారు అతిథిగా హాజరయ్యారు. కారా మాస్టారు రచనల స్ఫూర్తితోనే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ రచనా వ్యాసంగం ప్రారంభమైంది. కారా మాస్టారుని యండమూరి తన గురువుగా భావిస్తారు.

ఇదీ చదవండి:మేడ్చల్‌ జిల్లాలో కుటుంబం ఆత్మహత్య

Last Updated : Jun 4, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details