- వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా కొలువుదీరాడు. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ శైవక్షేత్రం ఉంది. ఇంద్రుడి బ్రహ్మహత్య పాపాన్ని నివారణ చేసిన శైవక్షేత్రంగా వేములవాడకు పురాణాల్లో స్థానం ఉంది.
కొమురవెల్లి:సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెల్లి మల్లన్న శివ భక్తులకు సుపరిచితం. 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో పూజలందుకుంటున్నాడని ప్రతీతి. సంక్రాంతి సమయంలో ఇక్కడ జరిగే పట్నాలు చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మహా శివరాత్రి నాడు కొమురవెల్లిలో చేసే.. కల్యాణం చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు.
- రామప్ప : కాకతీయులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం ఉంది. రామలింగేశ్వరుడి రూపంలో ఇక్కడ శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. అద్భుతమైన శిల్పసంపదకు రామప్ప ఆలయం నిలయం.
కాళేశ్వరం :జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న ఈ శైవక్షేత్రం ఇప్పుడు తెలంగాణ మొత్తానికి సుపరిచితం. ఇక్కడ యముడికి ప్రత్యక్షమైనందున శివుడిని కాళేశ్వరుడు అంటారు. కాళేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత ముక్తేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇక్కడ ఉన్న లింగానికి రెండు రంధ్రాలుంటాయి. ఆ రంధ్రాల్లో నీళ్లు పోస్తే ఒక ధార గోదావరి, మరొకటి ప్రాణహిత సంగమంలో కలుస్తాయని నమ్మకం.
- వేయి స్తంభాల గుడి: వరంగల్ జిల్లా, హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే ప్రసిద్ధి. 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉన్నారు.
- కీసర :హైదరాబాద్కు అతి దగ్గరో ఉన్న, ఎక్కువమంది వెళ్లే శైవక్షేత్రం ఇది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పూజ చేసుకోడానికి వారణాసి నుంచి లింగం తీసుకురమ్మని రాముడు ఆంజనేయుడిని పురమాయిస్తాడు. తీరా వారణాసి వెళ్లిన ఆంజనేయుడు.. అక్కడ ఉన్న 101 లింగాలను చూసి.. ఏ లింగం తీసుకెళ్లాలో తెలియక 101 లింగాలను తీసుకెళ్తాడట. అప్పటికీ ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగం ప్రసాదించాడని స్థలపురాణం చెబుతుంది. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరి పారేశాడట. అందుకే.. కీసరలో ఎక్కడ చూసినా.. లింగాలే కనిపిస్తాయి.