ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పదిరోజుల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. నెల్లూరు జిల్లా కావలిలో తండ్రీతనయులు ఒకేరోజు చనిపోయారు. విజయవాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఐదురోజుల వ్యవధిలో మృతి చెందారు. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి..సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తొలిదశలో కంటే..రెండో దశలో ఈ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. కొందరిలో వైరస్ శరీరంలోకి చొచ్చుకుపోయి లక్షణాలు బయటకు రానీయకుండానే నష్టం చేస్తోంది. మరికొందరిలో లక్షణాలు బయటపడి.. నిర్ధారణ పరీక్ష చేయించుకుని ఫలితం కోసం వేచి చూసేలోపే ప్రభావాన్ని చూపుతోంది. అనుకోకుండా శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు రావడంతో ఆసుపత్రులకు పరిగెడుతున్నారు. ఈ క్రమంలో కొందరిలో ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తి బాధితులు ప్రాణాలు విడుస్తున్నారు.
ఎందుకిలా?
వైరస్ సోకిన వ్యక్తికి కుటుంబ సభ్యులు ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌గా ఉండడం, ఇరుకు ఇళ్లలో నివాసం, వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సకాలంలో వైద్యుల్ని సంప్రదించకపోవడం వంటి కారణాలవల్ల ఈ వరుస మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వైరస్ మ్యుటేషన్ తీవ్రంగా ఉన్నందున కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనలపై లోతుగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కొందరు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. కొన్నిచోట్ల కరోనా బాధితులు ఇంట్లో ఉన్న సమయంలో మాస్కు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించినా.. కొందరు ఆలస్యంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. మరికొందరు అర్హతలేని వైద్య సేవలు పొందుతున్నారు. ఈ క్రమంలో జరిగే జాప్యం తీవ్రత ప్రభావం బాధితుడిపైనే కాకుండా ఇంట్లోని కుటుంబసభ్యులపై ముఖ్యంగా వృద్ధులపై పడుతోంది. ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయితే టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో మరణాల శాతం అతి స్వల్పంగా ఉంది.
డెంగీ విషయంలోనూ...
డెంగీ విషయంలోనూ గతంలో ఇదే జరిగింది. మొదటి విడతతో పోల్చితే రెండోసారి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడు కొవిడ్-19లోనూ అదే జరుగుతోంది. డెంగీలో 4 రకాలున్నాయి. ఒక్కో రకంలో ఒక్కో తీవ్రత బయటపడింది. మొదటిసారి డెంగీ వచ్చినప్పుడు దానికి తగినట్లు మనుషుల శరీరంలో యాంటీబాడీలు సిద్ధమయ్యాయి. రెండోసారి అది తీవ్రత మార్చుకుని వచ్చింది. అప్పుడు ఈ వైరస్‌ను పసిగట్టినప్పటికీ తీవ్రత గుర్తించకుండా శరీరం పాత యాంటీబాడీలతోనే దానిపై పోరాడింది. దీంతో అవి వైరస్‌ను నియంత్రించలేకపోగా.. రక్తంలో కలిసిపోయి ఇతర కణాలపై ప్రభావం చూపాయి.