కరోనా మహమ్మారి బంధాలను సైతం దూరం చేస్తోంది. బతికున్నప్పుడే కాదు... భౌతికంగా దూరమైనా... అపోహలు వారి మధ్య అడ్డుకట్టలవుతున్నాయి. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకురావటం లేదు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
నిబంధనలే రక్ష..
చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మరణించాక ఆస్పత్రి సిబ్బంది మృతదేహంపై క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేసి భద్రంగా ప్లాస్టిక్ కవర్లో ఉంచుతారు. కుటుంబ సభ్యులు కోరిన అంబులెన్సులో ఎక్కిస్తారు. శవాన్ని నేరుగా శ్మశాన వాటికకు తీసుకెళ్లాలి. ఆరు అడుగుల లోతు గుంతలో పాతిపెట్టి పిడికెడు మట్టి వదలొచ్ఛు లేదా తల కొరివి పెట్టి దహనం చేయొచ్ఛు శవాన్ని ముట్టుకోకుండా, కొద్ది దూరంలో నిల్చుని సంప్రదాయ బద్ధంగా వీడ్కోలు చెప్పవచ్ఛు రెండు మాస్కులు ధరించి, అవసరమైతే పీపీఈ కిట్లు వేసుకుని ఆయా కార్యక్రమాలు పూర్తి చేస్తే కొవిడ్ సోకే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
తల్లిదండ్రులనూ చూడట్లేదు
*సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రూ. 20లక్షలు వెచ్చించి చికిత్స తీసుకున్న వ్యాపారి కొవిడ్‌తో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు పిల్లలు, పెద్ద కుటుంబం ఉంది. అంత్యక్రియలకు హాజరయ్యే ధైర్యం చేయలేదు. అంబులెన్సు సిబ్బందికే బాధ్యత అప్పగించారు. వీడియో కాల్ ద్వారా అంతిమ సంస్కారాలను వీక్షించారు.