పొద్దున్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు.. అందరి చేతిల్లో ఓటరు కార్డులు.. చూడగానే జనం పద్ధతిగా ఓట్లేయడానికి వచ్చారు అనుకుంటాం.. కానీ.. వాళ్లంతా అక్కడి ఓటర్లే కాదు. తిరుపతిలో ఓటు వేయడానికి చిత్తూరు, కడప ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లు.. ! క్యూలైన్లలో నించున్న వారికి తమ పేరు ఏంటో తెలీదు. అడ్రస్ చెప్పలేరు. తండ్రి పేరు, భర్త పేరు చెప్పమంటే పారిపోతుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటుహక్కు వినియోగించుకుందామని పోలింగ్ బూత్‌కు వెళితే.. అప్పటికే తన ఓటును ఎవరో వేసేసి ఉంటారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తిరుపతి ప్రాంతంలోకి వందలాదిగా బస్సులు, కార్లలో జనాలు తరలివచ్చారు. అందరి దగ్గరా ఓట్లస్లిప్పులు, గుర్తింపుకార్డులు ఉన్నాయి. ఏంటి అని అడిగితే తీర్థయాత్రకు వచ్చామంటారు.
ఆంధ్రప్రదేశ్లోనితిరుపతి ఉపఎన్నికలో ఇవాళ పొద్దున్నుంచి కనిపించిన దృశ్యాలివి. పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు.. ఓటుహక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. వందలకొద్దీ దొంగ ఓటర్లు.. తిరుపతిపై దండెత్తారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటు చూసినా నకిలీ ఓటర్లు, దొంగఓట్లు వేసేవాళ్లే కనిపించారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం, భాజపా, జనసేన పార్టీ నేతలు, ఏజెంట్లు.. వీరిని సాక్ష్యాలతో పట్టుకున్నారు.
'తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేయాలి'
దండెత్తిన దొంగఓట్లు..
ఇవాళ ఉదయమే తిరుపతి నగరంలోని అనేక ప్రాంతాల్లో పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు నకిలీ ఓటర్లు బయటకు వచ్చారు. ఎక్కడికక్కడ ఉదయాన్నే బారులు తీరి దర్జాగా ఓట్లు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే.. వాళ్ల చేతిలో ఓటరు ఐడీ కార్డు ఉంది. కానీ అది నకిలీది. పశ్చిమం వైపు ఉన్న పోలింగ్ బూతులకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పుంగనూరు, పలమనేరు ప్రాంతాల నుంచి... జీవకోన, మంగళం, రేణిగుంటు, శ్రీకాళహస్తి ప్రాంతాలకు కడప జిల్లా నుంచి ఓటర్లను నకిలీ ఓటర్లను తరలించారు. వీళ్లను ఏజెంట్లు స్థానిక నేతలు పట్టుకుంటే.. ఓటరు ఐడీలో ఉన్న పేర్లను కూడా చెప్పలేకపోయారు. కరోనా కారణంగా అందరూ మాస్కులు ధరించి ఉండటంతో ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారు. పేర్లు అడిగితే పారిపోతున్న వీడియోలు, ప్రేవేటు బస్సుల్లో నకిలీ ఓటర్లు తరలివస్తున్న వీడియోలు పదుల సంఖ్యలో ఇవాళ వైరల్ అయ్యాయి.
పక్కా ప్రణాళికతో..
పక్కా ప్రణాళికతో అధికార పార్టీ ఈ నకిలీ ఓట్ల దందాను నడిపించిందని తెదేపా, భాజపా ఆరోపించాయి. ముందస్తు వ్యూహంలో భాగంగానే ఒరిజనల్ ఓటరు కార్డుల తరహాలో నకిలీ ఐడీ కార్డులను సృష్టించారు. బయట ప్రాంతాల వ్యక్తులకు వీటిని సరఫరా చేసి.. వాటి వెనుక ఏ పోలింగ్ బూత్ కు వెళ్లాలో స్టిక్కర్ కూడా అంటించారు. వీరిని సమన్వయం చేసుకోవడానికి మనుషులను పెట్టి బస్సుల్లో పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. దొంగ ఓట్లు వేయడానికి తాము వచ్చామని కొంతమంది మహిళలు అంగీకరించారు. కొంతమంది బస్సులో వెళ్తుండగా తెలుగుదేశం శ్రేణులు అడ్డుకునున్నారు. తమని దొంగ ఓట్లు వేయడానికి తీసుకొచ్చినట్లు తెలియదని వారు ఒప్పుకున్నారు. దొంగ ఓటర్లను తరలిస్తున్న ఓ బస్సును అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సులను నకిలీ ఓటర్లను తరలించేందుకు తీసుకువచ్చారు. తమకు ఒక్కో ప్రాంతం కేటాయించారని ఎన్నికల అధికారులు సీజ్ చేసిన బస్ డ్రైవర్ స్పష్టం చేశారు.