ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో.. మిగతా శాఖల్లోనూ ప్రభుత్వం తనిఖీలు మొదలుపెట్టింది. చలానాల ద్వారా చెల్లించే నగదు జమపై విచారణ చేపట్టింది. సీఎఫ్ఎంఎస్‌కు జమ అవుతుందా లేదా అన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత విచారణ ప్రారంభమైంది.
ప్రజలు చెల్లించే చలానాల నగదు జమ కావడంలో అధికారులు.. జాప్యాన్ని గుర్తించారు. జాప్యం వల్లే అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అంతర్గత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలు గుర్తించారు. రూ.8.13 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. మొత్తం రూ.4.62 కోట్ల మేర అధికారులు రికవరీ చేశారు. 14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ప్రభుత్వ ఖజానాకు గండి..
నకిలీ చలానాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసిన ఈ కుంభకోణం ఏపీ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2018 నుంచి ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన చలానాలను పరిశీలించిన అధికారులు దాదాపు అన్ని జిల్లాల్లోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. 2021 జనవరి నుంచి నకిలీ చలానాలతో మోసం జరిగినట్లు గుర్తించారు.