తెలంగాణ

telangana

ETV Bharat / city

'తప్పుడు వార్తలు.. ప్రజాస్వామ్య పునాదులను పెకిలిస్తాయి..' - ఫ్యాక్ట్ చెక్

HYD Fact check 2022: ఉస్మానియా యూనివర్సిటీతో కలిసి హైదరాబాద్​లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఓయూ సీఎఫ్ఆర్డీలో తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలపై రెండు రోజుల వర్క్​షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి ఫ్రంకీ స్టర్మ్ పాల్గొని.. సందేశమిచ్చారు.

Fact Checking workshop for journalists in Osmania university Hyderabad
Fact Checking workshop for journalists in Osmania university Hyderabad

By

Published : Aug 9, 2022, 9:58 AM IST

ఉస్మానియా ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్

HYD Fact check 2022: తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు.. ప్రజాస్వామ్య పునాదులను పెకిలిస్తాయని యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి ఫ్రంకీ స్టర్మ్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై కలిసికట్టుగా చర్చించి పరిష్కారం దిశగా ముందుకు సాగాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయటంతో పాటు వాస్తవాలను ప్రజలకు అందించేందుకు జర్నలిస్టులు అదనపు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. ఉస్మానియా యూనివర్సిటీతో కలిసి హైదరాబాద్​లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఓయూ సీఎఫ్ఆర్డీలో ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్​షాప్​లో ఫ్రంకీ స్టర్మ్ పాల్గొన్నారు.

యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి ఫ్రంకీ స్టర్మ్

"వాస్తవిక సమాచార మార్పిడి జరిగేలా వాతావరణాన్ని ఏర్పాటు చేయటం ద్వారా ప్రజాస్వామ్య మూలాలను మరింత మెరుగుపరచవచ్చు. నకిలీ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలపై తెలుగు జర్నలిస్టులకు ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికే వంద గంటల శిక్షణా తరగతులు పూర్తి చేయటం సంతోషకరమైన విషయం. ఇలాంటి శిక్షణా తరగతులు మరిన్ని జరగాల్సిన ఆవశ్యకత ఉంది." -ఫ్రంకీ స్టర్మ్, యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి

ధ్రువీకరణ లేని వార్తలు.. సంస్థలను, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఉస్మానియా ఉపకులపతి ప్రొఫెసర్ డి. రవిందర్ తెలిపారు. వార్తలను ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేసేముందే ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని, అవసరమైతే సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ కోరాలని సూచించారు. మీడియా, సమాచార వ్యాప్తి సంస్థలు ఎల్లప్పుడూ న్యాయంగా, సమతుల్యతతో పనిచేయాలని.. అప్పుడే వారికి సైతం గుర్తింపు లభిస్తుందని చెప్పారు. తెలుగు జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని యూఎస్ కాన్సులేట్ ఎంచుకున్నందుకు ఈ సందర్భంగా వీసీ కృతజ్ఞతలు తెలిపారు.

వందరోజుల శిక్షణ ద్వారా నేర్చుకునే మెలుకువలతో తెలుగు జర్నలిస్టులు ఇప్పటికే ఫలితాలు రాబడుతున్నారని ఉస్మానియా జర్నలిజం విభాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్ సన్ కోహిర్ తెలిపారు. శిక్షణ పొందిన జర్నలిస్టుల్లో పలువురు ఇప్పటికే తప్పుడు, నకిలీ వార్తలను గుర్తించి అడ్డుకోగలిగారని గుర్తు చేశారు. జర్నలిస్టుల నుంచి సైతం ఈ కోర్సుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ కోర్సులో ప్రధాన బోధకులుగా ఉన్న ఉడుముల సుధాకర్ రెడ్డి, బీఎన్ సత్యప్రియ రచించిన వాస్తవ తనిఖీపై తెలుగులో ఉన్న రిసోర్స్ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. పాత్రికేయుల రోజువారీ దినచర్యలో ఈ పుస్తకం అవసరమన్నారు. ఐఎఫ్​సీఎన్ పాయింటర్​లోని అంతర్జాతీయ శిక్షణా మేనేజర్ అలన్నా సుజానే డ్వోరక్, కార్పస్ క్రిస్టీలోని టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బొబ్బిలి.... ఈ సదస్సులో పాల్గొని తమ సందేశమిచ్చారు.

"నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం ఎలా..?" అనే అంశంపై తెలుగు జర్నలిస్టులకు 90 గంటల శిక్షణ కార్యక్రమం గత ఆరు నెలలుగా ఆన్​లైన్, ఆఫ్​లైన్ శిక్షణ కొనసాగుతోంది. జర్నలిస్టులు ఫేక్ న్యూస్​ను ఎలా నిరోధించాలి..? ప్రధాన మీడియాలో తప్పుడు సమాచారం రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి..? అనే అంశాలపై జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వటం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో ఫ్యాక్ట్ చెక్ శిక్షకులు ఉడుముల సుధాకర్ రెడ్డి, కొరీనా సురేశ్​, ప్రాజెక్టు సభ్యులు ఎస్.రాము, అబ్దుల్ బాసిత్, మీడియా అడ్వైజర్, యూఎస్ కాన్సులేట్, ఓయూ జర్నలిజం విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details